సంక్షిప్త వార్తలు (8)

కరోనా టీకా వికటించి, దేశంలో ఎవరైనా మరణిస్తే దానికి పరిహారాన్ని చెల్లించేలా ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడం తగదని కేంద్రం పేర్కొంది.

Updated : 30 Nov 2022 06:50 IST

ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడం తగదు
కరోనా టీకాలతో మరణాలపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ: కరోనా టీకా వికటించి, దేశంలో ఎవరైనా మరణిస్తే దానికి పరిహారాన్ని చెల్లించేలా ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడం తగదని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం సమర్పించింది. కొవిడ్‌-19 టీకాలు తీసుకున్న తర్వాత తమ ఇద్దరు కుమార్తెలు (19, 20 ఏళ్లు) ప్రాణాలు కోల్పోయారంటూ వారి తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పై కేంద్రం ఈ మేరకు స్పందించింది. ‘‘తృతీయపక్షాలు తయారు చేసిన వ్యాక్సిన్లు అన్ని సమీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. సురక్షితమైనవి, ప్రభావవంతమైనవని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వీటివల్ల మరణాలు సంభవించడం అత్యంత అరుదు. అందువల్ల.. పరిహారం చెల్లించే బాధ్యతను నేరుగా ప్రభుత్వంపై వేయడం చట్టపరంగా చెల్లుబాటు కాకపోవచ్చు’’ అని ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ ఈ అఫిడవిట్‌లో పేర్కొంది.


యూపీఎస్సీ సభ్యురాలిగా ప్రీతి సూదన్‌ బాధ్యతలు

ఈనాడు, దిల్లీ: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) సభ్యురాలిగా 1983 బ్యాచ్‌ ఏపీ కేడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రీతి సూదన్‌ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆమెతో  యూపీఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోని ప్రమాణం చేయించారు. కరోనా సమయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పని చేసిన ప్రీతి 2020 జులైలో పదవీ విరమణ చేశారు. అంతకుముందు కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాలు, మహిళా, శిశు అభివృద్ధి శాఖల కార్యదర్శిగా సేవలందించారు. ప్రపంచ బ్యాంకు సలహాదారుగానూ వ్యవహరించారు.


ఇక 9, 10 తరగతుల విద్యార్థులకే ప్రీ-మెట్రిక్‌ ఉపకార వేతనాలు
స్పష్టం చేసిన కేంద్రం

దిల్లీ: విద్యా హక్కు చట్టం కింద ఎనిమిదో తరగతి వరకూ బాలలందరికీ తప్పనిసరిగా విద్యను అమలు చేస్తున్నందున ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకానికి కేంద్రం పరిమితులు విధించింది. ఆ ప్రకారం ఓబీసీలు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన తొమ్మిది, పదో తరగతి చదివే విద్యార్థులకే ఇక ఉపకార వేతనాలు అందనున్నాయి. 2022-23 సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ, గిరిజన వ్యవహారాల శాఖ, మైనారిటీ వ్యవహారాలశాఖ ప్రకటించాయి. ఇప్పటి వరకూ 1 నుంచి 8వ తరగతి వరకు కూడా ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పథకం వర్తించేది.


పరుగు పందెంలో 80 ఏళ్ల బామ్మ సత్తా

80 ఏళ్ల వయసులోనూ సత్తా చాటుతోంది ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన ఓ బామ్మ. 100 మీటర్ల రన్నింగ్‌ రేసును కేవలం 49 సెకన్లలోనే పూర్తి చేసి విజేతగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


గ్యాంగ్‌స్టర్లు, తీవ్రవాదుల మధ్య సంబంధాలు
దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు

దిల్లీ: గ్యాంగ్‌స్టర్లకు, తీవ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలను విచ్ఛిన్నం చేయడంలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, దిల్లీ, రాజస్థాన్‌, చండీగఢ్‌తో పాటు హరియాణాలోని పలువురు గ్యాంగ్‌స్టర్ల ఇళ్లల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే యాంటీ టెర్రర్‌ ఏజెన్సీ నిఘాలో ఉన్న లారెన్స్‌ బిష్ణోయ్‌, నీరజ్‌ బవానా, టిల్లు తాజ్‌పురియాతో పాటు గోల్డీ బ్రార్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ సోదాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబరులో నాలుగు రాష్ట్రాలతో పాటు దిల్లీలోని 52 ప్రదేశాలలో ఎన్‌ఐఏ విస్తృత సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. ఈ సోదాల్లో ఆసిఫ్‌ ఖాన్‌ అనే న్యాయవాదితో పాటు హరియాణాకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌ను అధికారులు అరెస్టు చేశారు. ఉస్మాన్‌పుర్‌లోని గౌతమ్‌ విహార్‌కు చెందిన న్యాయవాది ఆసిఫ్‌ ఖాన్‌ ఇంట్లో జరిపిన సోదాల్లో నాలుగు ఆయుధాలతో పాటు పలు పిస్టోళ్లను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. న్యాయవాదికి.. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్లతో సత్సంబంధాలు ఉన్నట్లు విచారణలో రుజువైంది.


తగ్గిన ప్రసూతి మరణాల నిష్పత్తి

దిల్లీ: దేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తిలో తగ్గుదల గణనీయంగా కనిపిస్తోంది. 2014-16లో లక్ష జననాలకు 130 మరణాలు సంభవించగా, 2018-20 నాటికి ఆ సంఖ్య 97కు తగ్గింది. ఈ మేరకు భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌ పేర్కొంది.


ఉగ్రవాద కట్టడిలో ఉలేమాలే కీలకం: డోభాల్‌

దిల్లీ: భారత్‌, ఇండోనేసియా దేశాలకు సీమాంతర ఉగ్రవాదం, ఐసిస్‌ ప్రమాదం నిత్యం పొంచి ఉన్నాయని, ముస్లిం యువత తీవ్రవాదం వైపు మొగ్గకుండా ప్రగతిశీల భావాలను బోధించడంలో ముస్లిం మత విద్వాంసులు (ఉలేమాలు) కీలక పాత్ర నిర్వహించాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌  పేర్కొన్నారు. ఇస్లాం మత ధర్మం, న్యాయసూత్రాలలో విద్వాంసులైన భారత్‌, ఇండోనేసియా ఉలేమాల సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం ఆయన ప్రసంగించారు. ఇండోనేసియా జాతీయ భద్రతా సలహాదారు, మంత్రి అయిన మహమ్మద్‌ మహఫూద్‌ నాయకత్వంలో ఆ దేశ ఉలేమా బృందం భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చింది.  


పక్కింటిపై కోపం.. మాంసం, గుడ్డు పెంకులు వేసి వేధింపులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బండాలో పక్కింటిపై మాంసం ముక్కలు, గుడ్డు పెంకులు వేస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పొరుగింటి వారిపై కోపంతో ఆమె ఈ పని చేస్తున్నట్లు గుర్తించారు. ఫాతిమా అనే ఓ మహిళ నిత్యం తమ ఇంటిపై మాంసం ముక్కలు, గుడ్డు పెంకులు వేస్తోందని శివనారాయణ్‌ త్రిపాఠీ అనే ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరైన సాక్ష్యాధారాలు లేక ఆమెను అరెస్టు చేయలేదు. ఫాతిమా చేష్టలతో విసుగుచెందిన త్రిపాఠీ కుటుంబం తమ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను అమర్చుకుంది. నవంబరు 22న ఫాతిమా తమ ఇంటిపై మాంసం ముక్కలు, గుడ్డు పెంకులు వేస్తున్న దృశ్యాలు అందులో నమోదయ్యాయి. దీంతో బాధితులు పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు అందించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. ఫాతిమాను అరెస్టు చేశారు. ఫాతిమా ఇల్లు త్రిపాఠీ ఇంటి కంటే ఎత్తులో ఉంటుంది. వాటర్‌ ట్యాంక్‌ నిండిన తర్వాత మిగిలిన నీరు.. త్రిపాఠీ ఇంటిపై పడేది. దీని గురించి అడిగిన ప్రతిసారీ ఫాతిమా గొడవకు దిగేదని బాధితులు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు