5 నెలల గర్భిణి టీచర్‌పై విద్యార్థుల దాడి

అయిదు నెలల గర్భవతి అయిన ఓ ఉపాధ్యాయురాలిపై కొందరు విద్యార్థులు దాడికి పాల్పడిన అమానవీయ ఘటన అస్సాంలోని దిబ్రూగఢ్‌ జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ)లో చోటుచేసుకుంది.

Published : 30 Nov 2022 03:54 IST

అస్సాంలో అమానవీయ ఘటన
అనుచిత వైఖరిపై ఫిర్యాదే కారణం

దిబ్రూగఢ్‌: అయిదు నెలల గర్భవతి అయిన ఓ ఉపాధ్యాయురాలిపై కొందరు విద్యార్థులు దాడికి పాల్పడిన అమానవీయ ఘటన అస్సాంలోని దిబ్రూగఢ్‌ జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ)లో చోటుచేసుకుంది. చదువులో వెనుకబడిన, పాఠశాలలో అనుచిత ప్రవర్తనతో ఉంటున్న ఓ విద్యార్థి వ్యవహారంపై అతని అమ్మానాన్నలకు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మండలి(పీటీసీ) భేటీలో ఆమె వివరించడంతో వారు ఈ దుశ్చర్యకు దిగినట్లు పాఠశాల వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ‘‘ఆదివారం నాటి పీటీసీ సమావేశం అనంతరం అయిదు నెలల గర్భవతైన చరిత్ర బోధించే ఉపాధ్యాయురాలిని విద్యార్థులతో కూడిన బృందం వేధింపులకు గురిచేసింది. కొందరు ఆమెను తోసేశారు. వారిలో ఒకరు ఆమె జుట్టుపట్టుకొని లాగేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో కొందరు మహిళా టీచర్లు, పాఠశాల సిబ్బంది, కొందరు విద్యార్థినులు టీచర్‌ను విద్యార్థుల దాడి నుంచి రక్షించారు. దిగ్భ్రాంతికి గురైన టీచర్‌ సొమ్మసిల్లిపడిపోగా వెంటనే పాఠశాలకు చెందిన కారులో ఆమెను ఆసుపత్రికి తరలించారు. 10, 11 తరగతులకు చెందిన సుమారు 22 మంది విద్యార్థులు ఈ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. వారి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పిన వైస్‌ ప్రిన్సిపల్‌ రతీశ్‌ కుమార్‌ను కూడా నిందితులైన విద్యార్థులు ఫోనులో బెదిరించారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుందని వారు విద్యార్థులను హెచ్చరించి వదిలిపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని