బెయిలు మంజూరైనా జైళ్లలోనే మగ్గుతున్న ఖైదీల వివరాలివ్వండి

చిన్న చిన్న కేసుల్లో జైళ్లపాలై బెయిల్‌ మంజూరైనా పూచీకత్తు సమర్పించుకోలేక బందీలుగానే ఉండిపోతున్న ఖైదీల వివరాలను తెలపాలని దేశంలోని కారాగారాలన్నింటినీ సుప్రీంకోర్టు ఆదేశించింది.

Published : 30 Nov 2022 04:59 IST

దేశంలోని కారాగారాలన్నిటికీ సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: చిన్న చిన్న కేసుల్లో జైళ్లపాలై బెయిల్‌ మంజూరైనా పూచీకత్తు సమర్పించుకోలేక బందీలుగానే ఉండిపోతున్న ఖైదీల వివరాలను తెలపాలని దేశంలోని కారాగారాలన్నింటినీ సుప్రీంకోర్టు ఆదేశించింది. అటువంటి ఖైదీల పేర్లు, వారిపైనున్న అభియోగాలు, బెయిల్‌ మంజూరైన తేదీ, బెయిల్‌ వచ్చినా ఎన్నాళ్ల నుంచి లోపలే ఉండిపోయారు... తదితర వివరాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం తెలిపింది. ఆ ఖైదీల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు 15 రోజుల్లోగా జాతీయ న్యాయ సేవా సంస్థ(ఎన్‌ఎల్‌ఎస్‌ఏ)కు పంపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తూ... నిరుపేదలైన గిరిజనులు బెయిల్‌ మంజూరైనా పూచీకత్తు సమర్పించుకోలేని దుస్థితిలో విచారణ ఖైదీలుగా జైళ్లలోనే మగ్గిపోతున్నారని తెలిపారు. అటువంటి వారిని ఆదుకోవడం కోసం న్యాయవ్యవస్థ ఏమైనా చేయాలని సూచించారు. రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో అదే వేదికపై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ ఉన్నారు. ఓ కేసు విచారణ సందర్భంగా మంగళవారం జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం దేశంలోని జైళ్లన్నిటికీ ఆదేశాలిస్తూ...బెయిల్‌ మంజూరైనా విచారణ ఖైదీలుగా ఉన్న వారి వివరాలను పంపిస్తే అటువంటి వారి విడుదలకు జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని ఎన్‌ఎల్‌ఎస్‌ఏ రూపొందిస్తుందని పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని