సంక్షిప్త వార్తలు (5)

కొత్తగా అమల్లోకి తెచ్చిన విద్యుత్‌ సంబంధిత నిబంధనలు - 2022 కారణంగా గత అయిదు నెలల్లో డిస్కంలు రూ.1.68 లక్షల కోట్ల బకాయిలు చెల్లించినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ తెలిపింది.

Updated : 01 Dec 2022 07:22 IST

5 నెలల్లో రూ.1.68 లక్షల కోట్ల బకాయిలు చెల్లించిన డిస్కంలు
కేంద్ర విద్యుత్తు శాఖ వెల్లడి

ఈనాడు, దిల్లీ: కొత్తగా అమల్లోకి తెచ్చిన విద్యుత్‌ సంబంధిత నిబంధనలు - 2022 కారణంగా గత అయిదు నెలల్లో డిస్కంలు రూ.1.68 లక్షల కోట్ల బకాయిలు చెల్లించినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ తెలిపింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం బకాయిలు జూన్‌ 30 నాటికి రూ.1,37,949 కోట్లు ఉండగా, గత నాలుగు నెలల్లో రూ.24,680 కోట్లు వసూలైనట్లు పేర్కొంది. దీనివల్ల బకాయిల విలువ రూ.1,13,269 కోట్లకు తగ్గిపోయినట్లు తెలిపింది. ఈ నెల వారీ చెల్లింపుల కోసం 5 రాష్ట్రాలు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీల నుంచి రూ.16,812 కోట్ల రుణం తీసుకోగా, మరో 8 రాష్ట్రాలు సొంత వనరులను సమకూర్చుకున్నట్లు పేర్కొంది. ఎల్‌పీఎస్‌ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత బకాయిలు సక్రమంగా వసూలు అవుతున్న నేపథ్యంలో దేశంలోని విద్యుత్తురంగం ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.


లాలూకు 5న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స: తేజస్వీ

కుర్హని: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌కు డిసెంబరు 5న సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగనుందని ఆయన కుమారుడు, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ తెలిపారు. బుధవారం కుర్హని అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘శస్త్రచికిత్స ఉండటం వల్ల లాలూ రాలేకపోయారు’’ అని పేర్కొన్నారు.


తగ్గనున్న భారత్‌ గౌరవ్‌ రైలు ఛార్జీలు?

దిల్లీ: భారత్‌ గౌరవ్‌ రైళ్లకు ప్రయాణికుల నుంచి తగినంతగా ఆదరణ లేకపోవడంతో(ఆక్యుపెన్సీ రేటు) టికెట్‌ ఛార్జీలను దాదాపు 20 నుంచి 30 శాతం వరకూ బలవంతంగా తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది. అలాగే కనీసం రెండు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను కూడా ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) తప్పనిసరిగా రద్దు చేసుకునే పరిస్థితి నెలకొందని రైల్వే వర్గాల ద్వారా తెలిసింది. ఈ రైళ్లతో పోలిస్తే భారత్‌ దర్శన్‌ రైళ్లలో ఛార్జీలు తక్కువగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ గౌరవ్‌ రైళ్లలో ఏసీ 3 టైర్‌ ఛార్జీలను తగ్గించేందుకు ఆమోదం లభించిందని.. ఐఆర్‌సీటీసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రైల్వే వర్గాల ద్వారా తెలిసింది.


ఉత్సవాలతో సాంస్కృతిక వారసత్వం సుసంపన్నం: ప్రధాని మోదీ

ఇంఫాల్‌: ఉత్సవాలు, సంతలు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతమయ్యేందుకూ అవి దోహదపడతాయన్నారు. మణిపుర్‌లో నవంబరు 21 నుంచి నిర్వహిస్తున్న సంగాయీ ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. వాటి ముగింపును పురస్కరించుకొని ప్రధాని వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, ఘనమైన సాంస్కృతిక వారసత్వం మణిపుర్‌ సొంతమని ఆయన అన్నారు. అందుకే ఆ రాష్ట్రంలో ఒక్కసారైనా పర్యటించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటుంటారని తెలిపారు. మణిపుర్‌ విభిన్న రత్నాలను పొదిగిన హారంలాంటిదని, అది మినీ భారత్‌కు దర్పణం పడుతుంటుందని వ్యాఖ్యానించారు. సంగాయీ తరహా ఉత్సవాలు స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తాయని.. పెట్టుబడిదారులు, పరిశ్రమలను ఆకర్షిస్తుంటాయని పేర్కొన్నారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ కారణంగా గత రెండేళ్లు సంగాయీ ఉత్సవాన్ని నిర్వహించలేదు.


నమోదుకాని ఆసుపత్రులతో ప్రజారోగ్యానికి చేటు

నకిలీ ఔషధ నిపుణులతో నడిచే మందుల దుకాణాలతోనూ : సుప్రీంకోర్టు

దిల్లీ: నమోదు కాని ఆసుపత్రులు, నకిలీ ఔషధ నిపుణుల ఆధ్వర్యంలోని మందుల దుకాణాల కారణంగా పౌరుల ఆరోగ్యానికి చేటు కలుగుతోందని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ఎవరైనా వైద్యుడు రాసిన మందులచీటీ ప్రకారం ఔషధాలు ఇచ్చేందుకు నమోదైన ఔషధ నిపుణుడిని తప్ప ఇతరులను అనుమతించకుండా అధికారులకు ఆదేశాలివ్వాలంటూ ముఖేశ్‌ కుమార్‌ అనే ఫార్మాసిస్టు దాఖలు చేసిన పిటిషన్‌ను పట్నా హైకోర్టు కొట్టివేయడాన్ని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా పై మేరకు పేర్కొంది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు