Cancer: భారత్‌లో అబ్బాయిల్లోనే ఎక్కువగా క్యాన్సర్‌ గుర్తింపు

భారతదేశంలో క్యాన్సర్‌ వ్యాధిని అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లోనే ఎక్కువగా గుర్తిస్తున్నారని, బహుశా సమాజంలోని లింగవివక్షే ఇందుకు కారణం కావొచ్చని ‘ద లాన్సెట్‌ ఆంకాలజీ’ పత్రికలో ప్రచురితమైన పరిశోధన కథనం తెలిపింది.

Updated : 01 Dec 2022 09:12 IST

ద లాన్సెట్‌ ఆంకాలజీ పత్రికలో కథనం

దిల్లీ: భారతదేశంలో క్యాన్సర్‌ వ్యాధిని అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లోనే ఎక్కువగా గుర్తిస్తున్నారని, బహుశా సమాజంలోని లింగవివక్షే ఇందుకు కారణం కావొచ్చని ‘ద లాన్సెట్‌ ఆంకాలజీ’ పత్రికలో ప్రచురితమైన పరిశోధన కథనం తెలిపింది. 0 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసుండి, క్యాన్సర్‌ బారిన పడినవారి సమాచారాన్ని పరిశోధకులు సేకరించారు. భారతదేశంలోని మూడు ప్రధాన క్యాన్సర్‌ ఆసుపత్రుల నుంచి 2005 జనవరి 1 - 2019 డిసెంబరు 31 మధ్య రికార్డులను వారు పరిశీలించారు. దాంతో క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఎంతమందనే విషయం తెలిసింది. పీబీసీఆర్‌లలో నమోదైన సుమారు 11వేల మంది రోగుల్లో అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉందని, మూడు ఆసుపత్రుల్లోని 22వేల మంది పిల్లల్లోనూ ఎక్కువమంది బాలురేనని దిల్లీ ఎయిమ్స్‌లోని మెడికల్‌ ఆంకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ సమీర్‌ బక్షి తెలిపారు. పిల్లలను వ్యాధి నిర్ధారణకు తీసుకురావడంలో కొంత లింగవివక్ష ఉండొచ్చని, కానీ ఒకసారి తీసుకొచ్చి.. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఈ వివక్ష ఉండట్లేదని ఆయన వివరించారు. దక్షిణ భారతంతో పోలిస్తే ఉత్తర భారతంలో అమ్మాయిలు ఆసుపత్రుల్లో చికిత్సకు తక్కువగా వస్తున్నట్లు పరిశోధకులు గమనించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని