సంక్షిప్త వార్తలు(18)

మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాలు, గ్యాంగ్‌స్టర్‌, తుపాకీ సంస్కృతిని సమర్థించేలా ఉండే పాటలు లేదా సమాచారాన్ని ప్రసారం చేయరాదంటూ ఎఫ్‌ఎం ఛానళ్లను కేంద్రం ఆదేశించింది.

Updated : 02 Dec 2022 07:02 IST

‘మాదకద్రవ్యాలను సమర్థించే పాటలను ప్రసారం చేయొద్దు’

దిల్లీ: మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాలు, గ్యాంగ్‌స్టర్‌, తుపాకీ సంస్కృతిని సమర్థించేలా ఉండే పాటలు లేదా సమాచారాన్ని ప్రసారం చేయరాదంటూ ఎఫ్‌ఎం ఛానళ్లను కేంద్రం ఆదేశించింది. ఆయా ఛానళ్లకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పంపిన సూచనాపత్రంలో అనుమతి మంజూరు ఒప్పందం (జీవోపీఏ); బదిలీ అనుమతి మంజూరు ఒప్పందం (ఎంజీవోపీఏ)లోని నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. వాటిని ఉల్లంఘిస్తే ఆ ఒప్పందాల్లో పేర్కొన్న మేరకు శిక్షార్హమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.


30 లక్షల మంది పెన్షనర్ల నుంచి డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్లు

దిల్లీ: క్రమం తప్పకుండా పింఛన్‌ పొందడానికి వీలుగా ఏటా నవంబరులో జీవన ప్రమాణ పత్రాలు (లైఫ్‌ సర్టిఫికెట్లు) సమర్పించాల్సిన పింఛన్‌దారుల్లో దాదాపు 30 లక్షల మంది ఈసారి దానికోసం డిజిటల్‌ విధానాన్ని వినియోగించుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాము జీవించి ఉన్నట్లు ధ్రువపత్రం సమర్పించడానికి బ్యాంకు శాఖలకు వెళ్లి, క్యూలో నిల్చోవడం వృద్ధులకు, రోగులకు ఇబ్బందికరం కావడంతో డిజిటల్‌ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. దీనిపై ఈ ఏడాది విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో 30.34 లక్షల మంది డిజిటల్‌ విధానాన్ని వాడుకున్నారనీ, వీరిలో 2.82 లక్షల మంది ముఖ గుర్తింపు సాంకేతికతను విజయవంతంగా వినియోగించుకున్నారని కేంద్రం తెలిపింది. ఆండ్రాయిడ్‌ ఆధారితంగా పనిచేసే ఏ స్మార్ట్‌ఫోన్‌ ద్వారానైనా ఆధార్‌ సాయంతో జీవన పత్రాలు సమర్పించడం వీలవుతోందని వివరించింది.


ప్రేమ వివాహాల కోసం మతం మారిన ముస్లిం యువతులు

బరేలీ (యూపీ): తరచూ లవ్‌జిహాద్‌ గురించి వినిపించే ఉత్తర్‌ప్రదేశ్‌లో దానికి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు తాము ప్రేమిస్తున్న వ్యక్తులతో వివాహాల కోసం హిందూమతం స్వీకరించారు. బరేలీ జిల్లాకు చెందిన ఇరామ్‌ జైదీ.. వివాహానంతరం తన పేరును స్వాతిగా, మరో యువతి షెహనాజ్‌ తన పేరును సుమన్‌ దేవిగా మార్చుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లిళ్లలో వీరు సిందూరం ధరించి, మంగళసూత్రధారణతో ఏడడుగులు నడిచారు. బుధవారం వివాహాలు చేసుకున్న తర్వాత రెండు జంటలూ తమకు కుటుంబీకుల నుంచే ప్రాణభయం ఉందంటూ పోలీసు రక్షణను కోరాయి. రక్షణ కల్పించడానికి పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

 ఈటీవీ భారత్‌


తప్పుపై పోరాడతాను బిల్కిస్‌ బానో వెల్లడి

దిల్లీ: ఏది తప్పు..ఏది సరైనది అనే విషయమై తాను తిరిగి గట్టిగా పోరాడతానని సామూహిక అత్యాచార బాధితురాలు బిల్కిస్‌ బానో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు ఏడుగురిని హతమార్చి, అయిదు నెలలు గర్భిణిగా ఉన్న తనపై అత్యాచారానికి పాల్పడి దోషులుగా తేలిన 11 మందిని జైలు నుంచి విడుదల చేయడాన్ని, వారికి ఉపశమన విధానాన్ని అమలు పరచడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె బుధవారం సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

ఈ క్రమంలో ‘‘మరోసారి నిలబడి న్యాయం తలుపులు తట్టాలన్న నిర్ణయం నాకు సులభమైనది కాదు. సుదీర్ఘ కాలం తరువాత నా కుటుంబం మొత్తాన్ని, నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తులు జైలు నుంచి విడుదలయ్యారు. నేను నిస్సత్తువగా ఉన్నాను. దిగ్భ్రాంతితో, నా చిన్నారులు, ఆడపిల్లలపై బెంగతో అచేతనంగా మారిపోయాను. ఆశపై నమ్మకం పోయి నిశ్చేష్ఠురాలనయ్యాను’’ అని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో బిల్కిస్‌ బానో తెలిపారు. అయితే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లభించిన మద్దతుతో తనలోని నిశ్శబ్ద ఖాళీలు భర్తీ అయ్యాయని, ఆశలు రేకెత్తాయని.. ఈ క్రమంలోనే తిరిగి పోరుబాట పట్టినట్లు వివరించారు.  


సునంద పుష్కర్‌ మృతి కేసులో.. దిల్లీ పోలీసుల రివిజన్‌ పిటిషన్‌
ఎంపీ శశిథరూర్‌ వివరణ కోరిన హైకోర్టు

దిల్లీ: దాదాపు పదిహేను నెలల విరామం అనంతరం దిల్లీ పోలీసులు కాంగ్రెస్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ భార్య సునంద పుష్కర్‌ ఆకస్మిక మృతి కేసును మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ కేసు నుంచి శశిథరూర్‌కు సిటీ కోర్టు గతంలో విముక్తి కల్పించగా.. జాప్యానికి క్షమాపణ కోరుతూ గురువారం దిల్లీ పోలీసులు హైకోర్టులో రివిజన్‌ పిటిషను దాఖలు చేశారు. దీనిపై పార్లమెంటు సభ్యుడి వివరణ కోరిన దిల్లీ హైకోర్టు 2023 ఫిబ్రవరి 7న కేసు విచారణ చేపడతామని ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా వ్యాపారవేత్తగా పేరున్న సునంద పుష్కర్‌ ఏడేళ్ల కిందట దేశ రాజధాని నగరంలోని ఓ విలాసవంతమైన హోటలులో అనుమానాస్పద పరిస్థితుల్లో విగత జీవిగా కనిపించారు. థరూర్‌ అధికారిక నివాసం మరమ్మతుల కారణంగా ఈ దంపతులు ఆ హోటలులో బస చేశారు. ఈ కేసులో క్రూరత్వం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి నేరాల నుంచి థరూర్‌కు విముక్తి కల్పిస్తూ 2021 ఆగస్టులో సిటీ కోర్టు తీర్పు చెప్పింది. దీనిపై తాజాగా రివ్యూ పిటిషను దాఖలు కాగా.. థరూర్‌ తరఫు న్యాయవాది సుదీర్ఘ జాప్యాన్ని ప్రస్తావించారు. దీంతో ముందుగా పోలీసుల క్షమాపణ అంశాన్ని పరిశీలిస్తామని జస్టిస్‌ డీకే శర్మ పేర్కొన్నారు.


ఈడీ డైరెక్టర్‌ పదవీకాలం పెంపుపై సవాల్‌

దిల్లీ: ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రకు వరుసగా మూడోసారి పదవీ కాలం పొడిగింపును సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేత జయా ఠాకుర్‌ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని ఆరోపించారు. ఒకే వ్యక్తికి పదేపదే పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ పోవడం దేశ ప్రజాస్వామ్య ప్రక్రియను ధ్వంసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.


ఎంపీ నవనీత్‌ రాణా దంపతులకు వారెంట్లు

ముంబయి: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, బడనేరా ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు ముంబయిలోని ప్రత్యేక కోర్టు గురువారం బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. అప్పటి సీఎం  ఉద్ధవ్‌ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్‌ చాలీసా పఠనానికి పిలుపు ఇవ్వడం ద్వారా భిన్న వర్గాల నడుమ శత్రుత్వం పెంచుతున్నారన్న అభియోగాలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రజాప్రతినిధులు ఇద్దరినీ ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు తాజా విచారణకు నవనీత్‌ దంపతులు గైర్హాజరు కావడంతో బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసిన ప్రత్యేక జడ్జి ఆర్‌.ఎన్‌.రోకడే.. డిసెంబరు 14న కోర్టు ఎదుట హాజరై చెరో రూ.5 వేలు చెల్లించి వారెంట్లు రద్దు చేయించుకోవాలని సూచించారు.  


డీలిమిటేషన్‌ కమిషన్‌కు పునర్నిర్మాణ అధికారాలు
జమ్మూకశ్మీర్‌పై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్నిర్మాణానికి ఏర్పాటుచేసిన డీలిమిటేషన్‌ కమిషన్‌కు ఆ అధికారాలు కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. డీలిమిటేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని ప్రభుత్వం కోరింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. జమ్మూకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2019 కేంద్రం ఏర్పాటుచేసిన డీలిమిటేషన్‌ కమిషన్‌కు ఆటంకం కాబోదని స్పష్టం చేశారు. ఇద్దరు పిటిషనర్ల తరఫు న్యాయవాది.. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ప్రక్రియ జరుగుతోందని వాదించారు. సరిహద్దుల మార్పు, విస్తరణ ప్రాంతాల విలీనం వంటివి చేయకూడదని తెలిపారు. దీంతో జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పును రిజర్వు చేసింది.


పార్లమెంటులో 16 కొత్త బిల్లులు

దిల్లీ: ఈ నెల 7 నుంచి ప్రారంభమై 29తో ముగిసే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. వాటిలో బహుళ-రాష్ట్రాల సహకార సంఘాల్లో జవాబుదారీ పెంపుదలకు, వాటి ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన బిల్లు ఉంది. అంతేకాకుండా 1948లో రూపొందించిన దంతవైద్యుల చట్టం స్థానంలో నేషనల్‌ డెంటల్‌ కమిషన్‌ ఏర్పాటుకు మరో బిల్లు, నేషనల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫెరీ కమిషన్‌ బిల్లు కూడా ఉన్నాయి. లోక్‌సభ గురువారం విడుదల చేసిన బులెటిన్‌ ఈ మేరకు పేర్కొంది.


బీఎస్‌ఎఫ్‌ జవానును అప్పగించిన పాక్‌

దిల్లీ: దట్టమైన పొగమంచులో పొరపాటున పాకిస్థాన్‌ భూభాగంలోకి వెళ్లిన ‘సరిహద్దు భద్రత దళం’ (బీఎస్‌ఎఫ్‌) జవానును పాక్‌ రేంజర్లు గురువారం సురక్షితంగా బీఎస్‌ఎఫ్‌కు తిరిగి అప్పగించారు.



ఛత్తీస్‌గఢ్‌ డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసు

దిల్లీ: తన తండ్రిని పోలీసులు కొట్టారన్న ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛత్తీస్‌గఢ్‌ డీజీపీకి గురువారం నోటీసు ఇచ్చింది. ఈ ఘటన జీవించే హక్కును ఉల్లంఘించేలా, బాధితుల గౌరవానికి భంగం కలిగించేలా ఉందని పేర్కొంది. ఇటీవల బిలాస్‌పుర్‌ జిల్లాలో ఓ యువకుడు బైకుపై వెళ్తూ మహిళలను ఢీకొన్నాడు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకుడి ఇంటికి వెళ్లిన సమయంలో అతడు లేకపోవడంతో తన తండ్రిని స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారు. ఇది చూసిన యువకుడు మరుసటి రోజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని డీజీపీని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.


ర్యాగింగ్‌ బాధిత విద్యార్థికి వెన్నెముక శస్త్రచికిత్స పూర్తి

వర్సిటీ నుంచి మరో నలుగురి బహిష్కరణ

గువాహటి: అస్సాంలోని దిబ్రూగఢ్‌లో యూనివర్సిటీలో సీనియర్ల ర్యాగింగ్‌ నుంచి తప్పించుకోవడానికి రెండో అంతస్తు నుంచి దూకి తీవ్రంగా గాయపడిన బాధిత విద్యార్థి ఆనంద్‌ శర్మకు గురువారం వెన్నెముక శస్త్రచికిత్స పూర్తయింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం జరిగిన ర్యాగింగ్‌ ఘటనకు సంబంధించి ఇప్పటికే 18 మందిని వర్సిటీ నుంచి తొలగించగా, ఇప్పుడు మరో నలుగురిపై మూడేళ్ల కాలానికి బహిష్కరణ వేటు వేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ముగ్గురు హాస్టల్‌ వార్డెన్లను సస్పెండ్‌ చేశారు. మరోవైపు ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ర్యాగింగ్‌ ఘటనలను అరికట్టడానికి రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విస్తృత సోదాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా కోర్సు పూర్తయినా హాస్టళ్లలో నివసిస్తున్న విద్యార్థులను గుర్తించి వారిని పంపించి వేస్తామని తెలిపారు.


మైన్‌పురీ ఉప ఎన్నికలో పోలీసుల తీరుపై ఈసీ ఆగ్రహం

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉప ఎన్నిక జరుగుతున్న మైన్‌పురీ లోక్‌సభ స్థానంలో అధికారుల బదిలీ ఆదేశాలు అమలు చేయడంలో విఫలమైన సీనియర్‌ పోలీసు అధికారిపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరిన ఈసీ ఆరుగురు ఎస్‌ఐల బదిలీకి తాజా ఆదేశాలు జారీ చేసింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపక నేత ములాయంసింగ్‌ యాదవ్‌ మృతితో ఉప ఎన్నిక జరుగుతున్న మైన్‌పురీలో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ ఎస్పీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.


ఊపిరితిత్తుల వ్యాధితోనే ఎలుక మరణం

నీళ్లలో ముంచినందువల్ల కాదు..
ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడి

బదాయూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వ్యక్తి ఎలుకకు రాయి కట్టి నీటిలో ముంచి చంపినట్లు నమోదైన కేసులో పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఎలుకకు ఊపిరితిత్తుల వ్యాధి ఉందని పరీక్షల్లో తేలినట్లు అధికారులు తెలిపారు. ఊపిరితిత్తులు వాపునకు గురవడం వల్ల శ్వాస సంబంధ సమస్యలతో ఎలుక మరణించినట్లు నివేదికలో పేర్కొన్నారు. దాని ఊపిరితితుల్లో నీటి ఆనవాలు కనిపించలేదని తెలిపారు. ఈ కేసులో నిందితుడైన మనోజ్‌ కుమార్‌కు పోలీసులు బెయిల్‌ ఇచ్చారు.


అమెరికాతో విన్యాసాలపై చైనాకు ఎందుకు అభ్యంతరం?: బాగ్చి

దిల్లీ: ఉత్తరాఖండ్‌లో అమెరికాతో కలిసి మన దేశం చేసిన ఉమ్మడి సైనిక విన్యాసాలపై చైనా అభ్యంతరాలను విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తోసిపుచ్చారు. 1993, 1996 ఒప్పందాలతో దీనికి ఏమాత్రం సంబంధం లేదనీ, నిజానికి వాటిని చైనాయే ఉల్లంఘించిందని గురువారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఏ దేశంతోనైనా భారత్‌ విన్యాసాలు చేస్తుందనీ, తృతీయ పక్షానికి దీనిపై వీటో అధికారమేమీ లేదని స్పష్టంచేశారు.


2026 నాటికి ఎన్‌సీఆర్‌లో  డీజిల్‌ ఆటోలు నిషేధం

దిల్లీ: 2026 చివరి నాటికి దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో డీజిల్‌ ఆటోలపై నిషేధం ఉంటుందనీ, దానిని దృష్టిలో పెట్టుకుని వచ్చే జనవరి 1 నుంచి కేవలం సీఎన్‌జీ, విద్యుత్తు ఆటోలనే రిజిస్టర్‌ చేయాలని ‘వాయు నాణ్యత యాజమాన్య కమిషన్‌’ గురువారం యూపీ, రాజస్థాన్‌, హరియాణా ప్రభుత్వాలకు సూచించింది. 2027 జనవరి ఒకటి నుంచి ఎన్‌సీఆర్‌లో తిరిగే ఆటోల్లో ఈ రెండు రకాలకే అనుమతి ఉంటుందని గుర్తుచేసింది.


బయోటెక్నాలజీలో విభాగాల విలీనం

దిల్లీ: బయోటెక్నాలజీ విభాగంలోని 14 సంస్థల్ని విలీనం చేసి, ఒకటిగా మార్చే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. పనితీరులో సౌలభ్యం, సమీకృత పనివిధానం కోసం ఇలా చేస్తున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు.


ఉమ్మడి పౌరస్మృతి అమలుపై కమిటీ: చౌహాన్‌

భోపాల్‌: ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని మధ్యప్రదేశ్‌లో అమలు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ‘ఒకవ్యక్తి ఒకటి కంటే ఎక్కువసార్లు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాలి? ఒకే దేశంలో రెండు రకాల చట్టాలెందుకు?’ అని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని