మహిళా జడ్జీలతో ప్రత్యేక ధర్మాసనం

సుప్రీంకోర్టులో ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో కూడిన ఓ ప్రత్యేక ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ గురువారం ఏర్పాటు చేశారు.

Published : 02 Dec 2022 07:52 IST

సుప్రీంకోర్టు చరిత్రలో మూడోసారి

దిల్లీ: సుప్రీంకోర్టులో ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో కూడిన ఓ ప్రత్యేక ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ గురువారం ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రత్యేక బెంచిని ఏర్పాటుచేయడం అత్యున్నత న్యాయస్థానం చరిత్రలో ఇది మూడోసారి. కోర్ట్‌ నంబర్‌ 11లో ఉన్న ఈ ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది.. వివాహ వివాదాలతోపాటు బెయిలుకు సంబంధించిన బదిలీ పిటిషన్లను విచారించనున్నారు. 2013లో తొలిసారిగా ఇలా మహిళా ధర్మాసనం ఏర్పడింది. సారథ్యం వహించాల్సిన జస్టిస్‌ ఆఫ్తాబ్‌ ఆలం గైర్హాజరు కావడంతో.. జస్టిస్‌ జ్ఞాన్‌ సుధామిశ్ర, జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌లతో బెంచి ఏర్పాటు యాదృచ్ఛికంగా సాధ్యమైంది. తర్వాత 2018లో జస్టిస్‌ ఆర్‌.బానుమతి, జస్టిస్‌ ఇందిరా బెనర్జీలతో కూడిన మరో మహిళా బెంచిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏర్పాటుచేసిన మూడో ధర్మాసనం ముందు 32 పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. ఇందులో వివాహ సంబంధిత వివాదాలపై 10, మరికొన్ని బదిలీ పిటిషన్లతోపాటు 10 బెయిల్‌ పిటిషన్లు ఉన్నాయి. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వారు.. జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ త్రివేది. 2027 నాటికి సీజేఐ రేసులో.. మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నాగరత్న నియమితులయ్యే అవకాశముంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు