జన్యుమార్పిడి ఆవాల పంటకు పర్యావరణ అనుమతి ఇప్పుడు అవసరమా!

జన్యుమార్పిడి పంటల వల్ల పర్యావరణం కలుషితమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం సుప్రీంకోర్టు రెండు అంశాలపై ప్రశ్నించింది.

Published : 02 Dec 2022 03:40 IST

అలా చేయకపోతే దేశానికేమైనా విపత్తా?
కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

దిల్లీ: జన్యుమార్పిడి పంటల వల్ల పర్యావరణం కలుషితమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం సుప్రీంకోర్టు రెండు అంశాలపై ప్రశ్నించింది. జన్యుమార్పిడి ఆవాల పంటకు పర్యావరణ అనుమతిని ఇవ్వాల్సిన తక్షణ ఆవశ్యకత ఏమిటి? ఆ అనుమతిని నిరాకరించడం వల్ల దేశానికేమైనా విపత్తు సంభవిస్తుందా? తెలియజేయాల్సిందిగా జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం కోరింది. జన్యుమార్పిడి వ్యవస్థల విడుదలను నిలిపివేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త అరుణా రోడ్రిగ్స్‌, జీన్‌ క్యాంపెయిన్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ప్రశ్నలు సంధించింది. పాశ్చాత్య దేశాల రైతుల మాదిరిగా భారతీయ వ్యవసాయదారులు విద్యావంతులు కాదని, జన్యువులు, వాటి పరివర్తనలు వారికి అర్థం కావని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ వాదనలు వినిపిస్తూ... సామాజిక కార్యకర్తలు, నిపుణులు, శాస్త్రవేత్తలు కొందరు సశాస్త్రీయమైన హేతుబద్ధతతో కాకుండా సిద్ధాంతపరంగానే జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. కోర్టు ద్వారా నియమితులైన సాంకేతిక నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు నియంత్రణ వ్యవస్థను ప్రభుత్వం రూపొందించి ఆ ప్రక్రియను అనుసరిస్తోందని వివరించారు. అయితే, నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులపై ప్రభుత్వ అభిప్రాయం ఏమిటో తెలపాలని ధర్మాసనం కోరింది. దీంతో పాటు పార్లమెంటరీ కమిటీ నివేదికను కూడా ప్రభుత్వం పరిశీలించాలని సూచించింది. జన్యుమార్పిడి ఆవాలు మొక్కలు పుష్పించే దశకు చేరుకున్న సమయంలో పర్యావరణ కాలుష్యానికి అవి కారణమవుతాయని అరుణా రోడ్రిగ్స్‌ తరఫున బుధవారం వాదనలు వినిపించిన న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబరు 7న కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని