స్థానిక ఎద్దుల జాతి పరిరక్షణకు జల్లికట్టు ఎలా ఉపయోగపడుతుంది?

జల్లికట్టు క్రీడను అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం చట్టం తీసుకురావడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై గురువారం విచారణ సుదీర్ఘంగా జరిగింది.

Published : 02 Dec 2022 04:09 IST

తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

దిల్లీ: జల్లికట్టు క్రీడను అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం చట్టం తీసుకురావడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై గురువారం విచారణ సుదీర్ఘంగా జరిగింది. జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. జల్లికట్టును వినోదంగానే చూడరాదన్నారు. చారిత్రక నేపథ్యం, సంస్కృతి సంప్రదాయాలతో పాటు స్థానిక ఎద్దుల జాతి పరిరక్షణకు దోహదపడే చర్యగా భావించాలని తెలిపారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. మానవుల వినోదం కోసం జంతువులను హింసించడం ఎలా సమర్థనీయమని ప్రశ్నించింది. వినోదం కాకుంటే అంతమంది ప్రజలు ఎందుకు గుమికూడుతున్నారని ప్రశ్నించింది. ఆ క్రీడ సమయంలో అరుపులు, కేకలతో జంతువులను హింసించడం ఏమిటని నిలదీసింది. ధర్మాసనంలో జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ సభ్యులుగా ఉన్నారు. ధర్మాసనం ప్రశ్నలకు కపిల్‌ సిబల్‌ బదులిస్తూ... ఎద్దులను ఎంతో ప్రేమగా పెంచుతారని, ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉంటారని తెలిపారు. ఎద్దుల బలం, సామర్థ్యం ఆధారంగా మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందని తెలిపారు. అయితే, జల్లికట్టు క్రీడను కొనసాగించడం స్థానిక ఎద్దుల జాతి పరిరక్షణకు ఎలా ఉపయోగపడుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. జంతువులను ఆట పరికరాలుగా ఉపయోగించరాదని స్పష్టం చేసింది. సంస్కృతిలో జల్లికట్టు భాగమని నిరూపించడానికి ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసులో వాదనలు డిసెంబరు 6న కూడా కొనసాగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని