మీసాలు పెంచేవారికి ప్రత్యేక భృతి ఇవ్వాలి

గుజరాత్‌ ఎన్నికల వేళ.. జయాపజయాల మాటెలా ఉన్నా తన పొడవాటి మీసాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు మంగన్‌భాయ్‌ సోలంకి.

Published : 02 Dec 2022 04:47 IST

నన్ను గెలిపిస్తే ప్రత్యేక చట్టానికి కృషి చేస్తా
గుజరాత్‌లో స్వతంత్ర అభ్యర్థి మంగన్‌భాయ్‌

హిమ్మత్‌నగర్‌: గుజరాత్‌ ఎన్నికల వేళ.. జయాపజయాల మాటెలా ఉన్నా తన పొడవాటి మీసాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు మంగన్‌భాయ్‌ సోలంకి. గతంలో సైన్యంలో పనిచేసిన 57 ఏళ్ల సోలంకి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సబర్‌కాంటా జిల్లా హిమ్మత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రెండువైపులా కలిపి దాదాపు 5 అడుగుల పొడవున్న తన మీసాలే తనకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. ఆయనను కదిపితే వాటి గురించి ఎన్నో కబుర్లు చెబుతుంటారు. మీసాలు పెంచేవారందరికీ ప్రభుత్వం ప్రత్యేక భృతి ఇవ్వాలని కూడా ఆయన కోరుతున్నారు. తాను ఎన్నికైతే యువత మీసాలు పెంచేలా ప్రోత్సహించేందుకు చట్టం తేవాలని కూడా కోరుతానని చెప్పారు. సోలంకి ఆనరరీ లెఫ్టినెంట్‌గా 2012లో రిటైర్‌ అయ్యారు. ‘‘నేను సైన్యంలో ఉన్నప్పుడు నా మీసాల కోసం ప్రత్యేక భృతిని పొందేవాడిని. నా రెజిమెంట్‌లో ‘మీసాల మనిషి’గా గుర్తింపు పొందాను’’ అని గర్వంగా చెబుతున్నారు. విజయావకాశాలు అంతగాలేవని తెలిసినా పోటీచేయడం తనకిష్టమని ‘పీటీఐ’కి తెలిపారు. 2017లో బీఎస్పీ అభ్యర్థిగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినట్లు చెప్పారు. చివరి నిమిషం దాకా పట్టు వదలొద్దని సైన్యంలో తనకు చెప్పేవారని ఇప్పుడు కూడా అదే పాటిస్తున్నట్లు చెప్పారు. తొలి ఎన్నికల్లో వెయ్యి ఓట్లు వస్తే.. రెండో ఎన్నికలో 2,500 ఓట్లు వచ్చినట్లు చెప్పారు. ఈసారి ఆ సంఖ్య పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాను పశ్చిమ, తూర్పు, ఉత్తర సరిహద్దుల్లో పనిచేశానని.. ఎక్కడికి వెళ్లినా తన మీసాలే అందరినీ ఆకర్షించేవని తెలిపారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు కూడా ప్రజలు నా మీసాలు చూసి ఆశ్చర్యానికి లోనవుతుంటారు. పిల్లలు వాటిని తాకేందుకు ప్రయత్నిస్తుంటారు. యువకులు మీసాలు పెంచేందుకు చిట్కాలు అడుగుతుంటారు’’ అని సోలంకి చెప్పారు. మీసాలు పెంచడంలో తన తండ్రే తనకు ఆదర్శమని చెబుతున్నారు. తాను తన 19వ ఏట సైన్యంలో చేరానని.. అప్పటికే తనకు పొడవాటి మీసం ఉండేదని తెలిపారు. ఎక్స్‌-సర్వీస్‌ ఉద్యోగుల హక్కుల కోసం తాను పోరాడుతున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని