సంక్షిప్త వార్తలు(5)

ప్రయోజనకర మూలికలతో కూడిన ఆయుర్వేద ఔషధం ఫిఫాట్రాల్‌.. ఎగువ శ్వాసకోశ వ్యవస్థలో వచ్చే ఇన్‌ఫెక్షన్ల (యూఆర్‌టీఐ)ను సమర్థంగా ఎదుర్కోగలదని వెల్లడైంది.

Updated : 04 Dec 2022 05:54 IST

శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు ఫిఫాట్రాల్‌తో విరుగుడు!

దిల్లీ: ప్రయోజనకర మూలికలతో కూడిన ఆయుర్వేద ఔషధం ఫిఫాట్రాల్‌.. ఎగువ శ్వాసకోశ వ్యవస్థలో వచ్చే ఇన్‌ఫెక్షన్ల (యూఆర్‌టీఐ)ను సమర్థంగా ఎదుర్కోగలదని వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలు ‘ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆయుర్వేద అండ్‌ యోగా’లో ప్రచురితమయ్యాయి. భారత్‌లోని 203 మంది యూఆర్‌టీఐ రోగులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరికి రోజుకు రెండుసార్లు ఫిఫాట్రాల్‌ ఇచ్చారు. అనంతరం వీరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఔషధాన్ని పొందిన నాలుగు రోజులకే పరీక్షార్థుల ఆరోగ్యం 69.5 శాతం మేర మెరుగుపడినట్లు తేలింది. ఏడో రోజుకు 90.36 శాతం స్వస్థత చేకూరినట్లు వెల్లడైంది. ఫిఫాట్రాల్‌ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. ఫ్లూతో వచ్చే జ్వరం, ముక్కు కారడం వంటి సమస్యలపై ఇది సమర్థంగా పనిచేస్తుందని, కొవిడ్‌-19పై పోరుకూ అక్కరకొస్తుందని ఆయుర్వేద వైద్యులు ఇప్పటికే గుర్తించారు.


మానసిక దృఢత్వంతో దివ్యాంగుల అద్భుత విజయాలు

దివ్యాంగ సోదర, సోదరీమణులు మానసిక దృఢత్వంతో అద్భుత విజయాలను సాధిస్తున్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారికి నా అభినందనలు. వారు తమ జీవితాలను మెరుగుపర్చుకొనేందుకు అవసరమైన అన్ని అవకాశాలను కల్పించేలా మా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. దివ్యాంగుల అభ్యున్నతికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్న వారిని అభినందిస్తున్నాను.

నరేంద్ర మోదీ


ప్రజాస్వామ్య గొంతుకగా భారత్‌ జోడో యాత్ర

ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు 25 శాతం, ఎల్‌పీజీ ధరలు 40 శాతం తగ్గాయి. అయినా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఎందుకు తగ్గించలేదు? ప్రధాని మోదీజీ..! మీ దోపిడీ విధానాలపై పోరాడే ప్రజాస్వామ్య గొంతుకగా భారత్‌ జోడో యాత్ర ఉంటుంది. మీరు సమాధానం చెప్పి తీరాలి.

రాహుల్‌ గాంధీ


ఆ గోడలను బద్దలు కొట్టండి

హద్దులను, అడ్డంకులను అధిగమిస్తూ జీవితంలో ఎదగండి. మానవాళిని విభజించే అన్ని గోడలనూ బద్దలు కొట్టండి. ఆ ఇటుకలను మనుషుల మధ్య వారధులు నిర్మించడానికి వినియోగించండి. ప్రపంచ శాంతికి మీ వంతు కృషి చేయండి.

కైలాశ్‌ సత్యార్థి


ఆన్‌లైన్‌లో విద్వేషానికి చోటివ్వద్దు

ఆన్‌లైన్‌లో విద్వేషపూరిత ప్రసంగాలు నిజ జీవితంలో హాని కలిగించొచ్చు. కాబట్టి మీ సామాజిక మాధ్యమాల ఖాతాల్లో వాటికి చోటివ్వద్దు. సందేశాలను పంచుకొనేముందు వాస్తవాలను నిర్ధారించుకోండి. విద్వేష వ్యాఖ్యలకు లక్ష్యంగా మారిన బాధితులకు అండగా నిలవండి.

ఐక్యరాజ్య సమితి


విద్యుత్తు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ సభ్యుల పేర్ల సిఫార్సుకు కమిటీ ఏర్పాటు

ఈనాడు, దిల్లీ: విద్యుత్తు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు జ్యుడిషియల్‌, టెక్నికల్‌ కమిటీ సభ్యుల పేర్ల సిఫార్సు కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌ ఆధ్వర్యంలో సెర్చ్‌ కం సెలెక్షన్‌ కమిటీని కేంద్ర విద్యుత్‌శాఖ ఏర్పాటుచేసింది. ఇందులో సభ్యులుగా ఏపీటెల్‌ ఛైర్‌పర్సన్‌, కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ, పెట్రోలియం శాఖల కార్యదర్శులను నియమించారు. విద్యుత్తుశాఖ కార్యదర్శి దీనికి మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ప్రతి పోస్టుకు ఈ కమిటీ ఇద్దరి పేర్లను సిఫార్సు చేయాలని శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కేంద్ర విద్యుత్తుశాఖ పేర్కొంది.


ఎస్పీ సీనియర్‌ నేత ఆజం ఖాన్‌పై కేసు
ఈసీ, పోలీసులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు నమోదు

రాంపుర్‌ (యూపీ): సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత ఆజం ఖాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల సంఘం, పోలీసులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని శుక్రవారం కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ప్రజలను రెచ్చగొట్టేలా.. శాంతికి భంగం కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు నమోదైన కేసులో నెల రోజుల క్రితమే రాంపుర్‌ కోర్టు ఆజంఖాన్‌ను దోషిగా తేల్చింది.


దివ్యాంగులకు దారేది..?
భవనాల్లో సులభంగా ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేయకపోవడంపై ఉద్యమకారుల ఆందోళన

దిల్లీ: ప్రజలు పనుల కోసం ఎక్కువగా సందర్శించే ప్రభుత్వ, ప్రైవేటు భవనాలలో దివ్యాంగులు సులభంగా ప్రవేశించే ఏర్పాట్లు చేయాలని నిర్దేశిస్తూ 2016లో కేంద్రం దివ్యాంగుల హక్కుల చట్టం తెచ్చింది. దాని అయిదేళ్ల గడువు ఈ ఏడాది జూన్‌ 14తో ముగిసిపోయినా మొత్తం 2,839 భవనాలకు ఇంతవరకు 585 రాష్ట్ర ప్రభుత్వాల భవనాలు, 1,030 కేంద్ర ప్రభుత్వ భవనాల్లో మాత్రమే దివ్యాంగులకు ప్రవేశ సౌలభ్యం ఉంది. ఇకనైనా మహానగరాలు, పెద్ద పట్టణాల్లోని ప్రజోపయోగ భవనాలన్నింటినీ శారీరక వైకల్యం ఉన్నవారు సులువుగా ప్రవేశించేలా మార్చాలని శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినం సందర్భంగా హక్కుల ఉద్యమకారులు డిమాండ్‌ చేస్తున్నారు. భారతదేశ జనాభాలో 2 శాతంమందికి పైగా ప్రజలు శారీరక వైకల్యాలతో బాధపడుతున్నారు. భవన నిర్మాణ ప్రణాళికలకు అనుమతి ఇచ్చేటపుడు దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ ఏర్పాట్లు చేయాలనే నిబంధనను పురపాలక, నగర పాలక సంఘాలకు తప్పనిసరి చేయకపోవడం 2016నాటి చట్టంలో పెద్ద లోపం. భవనాల్లో, ప్రజా రవాణా వాహనాల్లో, ఇతర మౌలిక వసతుల్లో దివ్యాంగులు, వృద్ధులకు ప్రవేశ సౌలభ్యం లేకపోతే, సదరు లోపాలను ఫొటో తీసి పంపడానికి కేంద్రం నిరుడు సుగమ్య భారత్‌ యాప్‌ తీసుకొచ్చింది. ఈ ఏడాది ఆగస్టు వరకు ఈ యాప్‌ ద్వారా 1,009 ఫిర్యాదులు అందగా, వాటిలో 509 ఫిర్యాదులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలవద్ద అపరిష్కృతంగా పడి ఉన్నాయి. వీటి గురించి కేంద్రం ప్రత్యేకంగా పట్టించుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి నెలకొంది. సుగమ్య భారత్‌ యాప్‌ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క గుజరాత్‌ లోనే అత్యధికంగా 406 ఫిర్యాదులు అందాయి. వాటిలో 311 ఇప్పటికీ అపరిష్కృతమే. ఈ విషయంలో దిల్లీది రెండో స్థానం. ఇక్కడ 128 ఫిర్యాదులకు 60 పెండింగులో ఉన్నాయి.  దేశమంతటా గ్రామాల్లో ఇంతకన్నా అధ్వాన్న స్థితి నెలకొంది. దివ్యాంగులు భవనాల్లో ప్రవేశించడానికి వీలుగా ఏటవాలు చప్టాలను, రోడ్ల పక్కన ప్రత్యేక ఫుట్‌పాత్‌లను నిర్మించాల్సి ఉన్నా అవి పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు.



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని