నేవీలో అన్ని విభాగాల్లోనూ మహిళలకు ప్రవేశం

2047 నాటికి పూర్తిగా స్వావలంబన సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ తెలిపారు.

Published : 04 Dec 2022 05:16 IST

నౌకాదళాధిపతి హరికుమార్‌ వెల్లడి

దిల్లీ: 2047 నాటికి పూర్తిగా స్వావలంబన సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ తెలిపారు. దేశీయంగా రెండో విమానవాహక నౌకను సమకూర్చుకునేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ తరహాలో ఇటీవలే ప్రారంభించుకున్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నౌక సేవలపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఇంతకంటే పెద్ద నౌకను నిర్మించుకోవాలనే ప్రతిపాదనను పక్కనపెట్టి, ఇలాంటి రెండో నౌక కోసం ఆర్డర్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం జరగనున్న నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సామర్థ్యాన్ని పెంచుకునే చర్యల్లో భాగంగా అమెరికా నుంచి ప్రిడేటర్‌ డ్రోన్లు వంటివి సమీకరించుకోనున్నట్లు తెలిపారు. మునుపటి బానిస మనస్తత్వాన్ని పూర్తిగా విడనాడేలా అర్థరహిత పద్ధతుల్ని రద్దుపరిచే కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ‘వచ్చే ఏడాది నుంచి నేవీలో అన్ని విభాగాల్లో మహిళలకు ప్రవేశం కల్పిస్తాం. తొలిసారిగా మహిళా నావికులనూ (సెయిలర్లను) తీసుకుంటున్నాం. విమానవాహక నౌకలపై మోహరించడానికి రెండు ఇంజిన్లతో పనిచేసే విమానాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించనున్నాం. 2026 నాటికి నమూనా విమానం తయారవుతుంది. అగ్నిపథ్‌ కింద దాదాపు 3,000 మంది అగ్నివీరులను భారత నౌకాదళంలోకి తీసుకున్నాం. వీరిలో 341 మంది మహిళలు’ అని హరికుమార్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని