పార్లమెంటు ఆమోదాన్ని కోర్టు కాదనడం.. ప్రపంచంలో మరెక్కడా ఉండదు

‘అధికారమంటే ప్రజలు.. ఆ ప్రజలు మద్దతు ఇచ్చిన ప్రభుత్వమే. రాజ్యాంగ ప్రవేశికలోనూ ‘వుయ్‌ ది పీపుల్‌’ అన్నారు.

Published : 04 Dec 2022 05:17 IST

‘కొలీజియం’ వివాదంపై ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ వ్యాఖ్యలు

దిల్లీ: ‘అధికారమంటే ప్రజలు.. ఆ ప్రజలు మద్దతు ఇచ్చిన ప్రభుత్వమే. రాజ్యాంగ ప్రవేశికలోనూ ‘వుయ్‌ ది పీపుల్‌’ అన్నారు. ప్రజల మనోభావాలకు అద్దం పట్టేది పార్లమెంటే. అటువంటి పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని కోర్టు కాదన్న ఉదంతం ప్రపంచంలో మరెక్కాడా ఉండదు’ అని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అన్నారు. దిల్లీలో జరిగిన ఎల్‌.ఎం.సింఘ్వి స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ అభిప్రాయాలు వెల్లడించారు.  సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వేదికపై ఆశీనులై ఉండగా ఉప రాష్ట్రపతి ‘కొలీజియం’ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించడం గమనార్హం. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించేందుకు రూపొందించిన కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు పార్లమెంటు తీసుకువచ్చిన నేషనల్‌ జుడిషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ యాక్ట్‌ (ఎన్‌జేఏసీ యాక్ట్‌)ను రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కొట్టివేయడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఏదైనా అంశంలో చట్టపరమైన ప్రశ్నలు తలెత్తినపుడు మాత్రం కోర్టులు జోక్యం చేసుకోవచ్చని తెలిపారు. ‘ఇక్కడున్న మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజ్యాంగ నిబంధనను కొట్టివేసిన ఇలాంటి ఘటన ప్రపంచంలో మరెక్కడైనా సమాంతరంగా జరిగిందేమో ఆలోచించండి’ అని ధన్‌ఖడ్‌ కోరారు. నవంబర్‌ 26న జరిగిన ‘రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా కూడా ఉపరాష్ట్రపతి ఇదే విధమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని