సాగు బడిలో ఉద్గారాలకు కళ్లెం!

కర్బన ఉద్గారాల వెల్లువతో పర్యావరణంలో చోటుచేసుకుంటున్న ప్రతికూల మార్పులు మానవాళికి పెనుశాపంగా మారుతున్నాయి.

Published : 04 Dec 2022 05:22 IST

కర్బన తటస్థీకరణ సాధించిన కేరళ విత్తన ఉత్పత్తి పొలం

కర్బన ఉద్గారాల వెల్లువతో పర్యావరణంలో చోటుచేసుకుంటున్న ప్రతికూల మార్పులు మానవాళికి పెనుశాపంగా మారుతున్నాయి. భవిష్యత్తు తరం మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి బెడదను తీర్చేలా సరికొత్త సాగు విధానాన్ని ఆచరిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది కేరళ విత్తన అభివృద్ధి ప్రాధికార సంస్థ! ఈ సంస్థ పరిధిలో సాగవుతున్న ఓ పొలంలో ప్రస్తుతం కర్బన ఉద్గారాల తటస్థీకరణ జరుగుతోంది. దేశంలోకెల్లా ఈ ఘనతను అందుకున్న తొలి పొలం ఇదే. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈనెల 10న ఈ మేరకు ప్రకటన చేయనున్నారు.

ఎక్కడుందీ పొలం?

ఎర్నాకుళం జిల్లాలోని అలువాలో కేరళ రాష్ట్ర విత్తన తయారీ పొలం (కేఎస్‌ఎస్‌ఎఫ్‌) ఉంది. విస్తీర్ణం 14 ఎకరాలు. నిజానికి వ్యవసాయ శిక్షణ కేంద్రంగా (ప్రధానంగా చెరకు రైతుల కోసం) ఉపయోగించుకునేందుకు 1919లో దీన్ని ఏర్పాటుచేశారు. కాలక్రమంలో విత్తన ఉత్పత్తి పొలంగా మార్చారు. అధిక దిగుబడులనిచ్చే విత్తనాల ఉత్పత్తి కోసం కేఎస్‌ఎస్‌ఎఫ్‌లో వరిని పండిస్తుంటారు. అదనంగా టమాటా, బొప్పాయి, క్యాబేజీ తదితర పంటలపైనా ప్రస్తుతం దృష్టిపెడుతున్నారు. పదేళ్లుగా ఇక్కడ రసాయనిక ఎరువులు, పురుగుల మందులను వినియోగించడం లేదు. 

కర్బన తటస్థీకరణ అంటే..?

ఒక ప్రాంతంలో వెలువడే కర్బన ఉద్గారాల స్థాయి, అక్కడ ఆ ఉద్గారాలను తిరిగి శోషించుకోగల సామర్థ్యం సమానంగా ఉండటాన్ని ‘కర్బన తటస్థీకరణ’గా పిలుస్తారు. పొలం విషయంలో దాన్ని సాధించాలంటే కేవలం సేంద్రియ సాగుకు కట్టుబడి ఉంటే సరిపోదు. మరికొన్ని శాస్త్రీయ విధానాలనూ అనుసరించాల్సిందే.

ఎలా సాధించారు?

కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కేఎస్‌ఎస్‌ఎఫ్‌లో బాతులను పెంచుతున్నారు. అవి పొలాల్లో ఆహారాన్వేషణ సాగిస్తూ.. చీడపురుగుల బెడదను తగ్గిస్తున్నాయి.   ఇక్కడ పెంచుతున్న ఆవుల నుంచే సేంద్రియ ఎరువును తయారుచేస్తున్నారు. స్థానికంగా అమర్చిన సౌరఫలకాలతో విద్యుత్‌ అవసరాలు తీరుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని