హుగ్లీ తీరంలో ఐదు ఫిరంగులు

భారత నౌకాదళం మొదటి ప్రపంచ యుద్ధం కాలంనాటి ఐదు ఫిరంగులను గుర్తించింది.

Published : 05 Dec 2022 05:46 IST

వెలికి తీసిన నౌకాదళం
మొదటి ప్రపంచయుద్ధ కాలం నాటివి కావొచ్చని వెల్లడి

కోల్‌కతా: భారత నౌకాదళం మొదటి ప్రపంచ యుద్ధం కాలంనాటి ఐదు ఫిరంగులను గుర్తించింది. పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నది ఎడమ గట్టుపై ఇవి బయటపడ్డాయి. వీటిలో రెండింటిని అధికారులు పునరుద్ధరించి నలుపు రంగు వేశారు. ముందుభాగంలో ఎరుపు రంగు అంచుతోపాటు తెలుపు రంగు వేశారు. మోటిఫ్‌ని ముద్రించారు. అనంతరం వీటిని భారత నౌకాదళం పశ్చిమబెంగాల్‌ కేంద్ర కార్యాలయమైన ఐఎన్‌ఎస్‌ నేతాజీ సుభాష్‌ వద్ద ఏర్పాటుచేశారు. ‘‘ఈ ఫిరంగులు మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటివి కావొచ్చు. నౌకలపై ఏర్పాటుచేసేందుకు తయారు చేసి ఉండొచ్చు’’ అని కెప్టెన్‌ చక్రవర్తి తెలిపారు. అయిదు ఫిరంగుల్లో నాలుగింటిని గతేడాది ద్వితీయార్థంలో గుర్తించామని, ఈ ఏడాది భూమి నుంచి బయటకు తీశామని చెప్పారు. ఈ ప్రాంతం గతంలో నది గట్టులో భాగంగా ఉండేదని చెప్పారు. చివరి దానిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. నేలపై పిచ్చిమొక్కలను తొలగించే సమయంలో పరికరానికి ఫిరంగి తాకడంతో శబ్దం వచ్చిందని, ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించగా ఫిరంగులు బయటపడ్డాయని చక్రవర్తి వివరించారు. ఇవి ఎక్కడ తయారయ్యాయన్న సంగతి తెలుసుకునేందుకు వాటిపై ఎలాంటి గుర్తులు లేవని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని