విద్యార్థుల ఎంపికకు ‘క్లాట్‌’లో మార్పులు అవసరం!

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ప్రవేశాలకు ప్రస్తుతం నిర్వహిస్తున్న క్లాట్‌ పరీక్ష (కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు) ద్వారా ఎంపిక పద్ధతి సరైన ఫలితాలను ఇవ్వడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు.

Published : 05 Dec 2022 04:57 IST

సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌

పనాజీ: జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ప్రవేశాలకు ప్రస్తుతం నిర్వహిస్తున్న క్లాట్‌ పరీక్ష (కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు) ద్వారా ఎంపిక పద్ధతి సరైన ఫలితాలను ఇవ్వడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐయూఎల్‌ఈఆర్‌) తొలి విద్యా సంవత్సరాన్ని గోవాలో శనివారం ప్రారంభించాక ఆయన మాట్లాడారు. ఈ కేంద్రం అత్యాధునిక పరిశోధనలకు బీజం వేసి విద్యార్థుల పరిపూర్ణ వికాసానికి బాటలు వేస్తుందని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థుల ఎంపిక విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న ఒక సమస్యగా తాను భావిస్తున్నానని వివరించారు. కేవలం క్లాట్‌ పరీక్ష నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నామని, అన్నివేళలా ఇది విలువలతో కూడిన విద్యను అందించడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ రంగంపట్ల సరైన దృక్పథమున్నవారికి అవకాశాలు కల్పించాల్సి ఉందని అన్నారు. న్యాయవిద్యలో నాణ్యమైన బోధనను అందించాలని వర్సిటీ ఉపకులపతిని కోరారు. సంస్థ ఎక్స్‌అఫీషియో విజిటర్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, సుప్రీంకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని