చేతులు కలుపుదాం.. విజయం సాధిద్దాం
వచ్చే ఏడాది సెప్టెంబరులో దిల్లీలో జరిగే ప్రతిష్ఠాత్మక జి-20 దేశాల సదస్సు మనకొక బృహత్తర అవకాశమనీ, అది ఘన విజయం సాధించడంలో అందరం చేతులు కలుపుదామని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలకు ప్రధాని పిలుపు
జి-20 సదస్సుపై అఖిలపక్షానికి హాజరైన జగన్, చంద్రబాబు
చిహ్నంలో కమలం బదులు మరేదైనా వాడాల్సింది: మమత
ఈనాడు, దిల్లీ: వచ్చే ఏడాది సెప్టెంబరులో దిల్లీలో జరిగే ప్రతిష్ఠాత్మక జి-20 దేశాల సదస్సు మనకొక బృహత్తర అవకాశమనీ, అది ఘన విజయం సాధించడంలో అందరం చేతులు కలుపుదామని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు సంబంధించి రాజకీయపార్టీల అభిప్రాయాలు స్వీకరించడానికి సోమవారం రాష్ట్రపతి భవన్ అశోకాహాల్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఇది యావద్దేశం గర్వించాల్సిన తరుణమనీ, ఎవరికి వారు తమవంతు పాత్ర పోషించాలని మోదీ కోరారు. సదస్సుకు సంబంధించి వివిధ కార్యక్రమాల నిర్వహణలో ఒక జట్టుగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పెద్ద మెట్రో నగరాలే కాకుండా ఇతర ప్రాంతాల ప్రత్యేకతలూ ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు ఇదొక అవకాశమని తెలిపారు. తద్వారా పర్యాటకానికి, స్థానికంగా ఉపాధికి ఊతం లభిస్తుందన్నారు.
వివిధ ప్రాంతీయ పార్టీలకు నేతృత్వం వహిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌శిందే, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మిజోరం ముఖ్యమంత్రి జోరం తంగాలు దీనిలో పాలుపంచుకున్నారు. పార్టీల తరఫున భాజపా అధ్యక్షుడు జేపీనడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఏఐఏడీఎంకె ప్రధాన కార్యదర్శి పళనిస్వామితోపాటు మొత్తం 26 మంది పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, జేడీయూ అధ్యక్షుడు లలన్‌సింగ్ దీనికి హాజరుకాలేదు. ఆర్జేడీ నుంచి కూడా ఎవరూ రాలేదు.
చొరబాట్లకు కళ్లెం.. భద్రతామండలిలో సభ్యత్వం
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వాగత వచనాలు పలుకగా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభోపన్యాసం చేశారు. జి-20 సదస్సు సందర్భంగా భారత్ తరఫున నిర్వహించబోయే కార్యక్రమాలపై విదేశాంగశాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. తొలుత మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడారు. తర్వాత భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. కూటమి సారథ్య అవకాశంతో చైనా చొరబాట్లకు కళ్లెం వేసే ప్రయత్నం చేయాలని ఖర్గే సూచించారు. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం కూడా ఈ అవకాశం ఉపయోగపడాలన్నారు. మమతాబెనర్జీ దిల్లీకి బయల్దేరే ముందు కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ- జి 20 సారథ్యం ఒక పార్టీకి సంబంధించిన ఎజెండా కాదనీ, ఇది యావద్దేశానిది అని చెప్పారు. కూటమి చిహ్నంలో కమలం మినహా మరేదైనా జాతీయ చిహ్నాన్ని వాడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా సహా కొందరు విపక్ష నేతలు మాట్లాడుతూ- జి-20కి సారథ్యం అనేది కూటమిలో ప్రతి దేశానికి వంతులవారీగా వస్తుంటుందనీ, దీనిని ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడం తగదని అన్నారు.
తలపాగా... చాయ్ పే చర్చా..
ఉదయ్‌పుర్: జి-20కి సంబంధించి వివిధ దేశాల ప్రతినిధులు రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో సోమవారం సమావేశమయ్యారు. వారంతా తలపాగాలు సహా రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి అలరించారు. ‘చాయ్ పే చర్చా’లో పాల్గొన్నారు. వాతావరణ మార్పులకు కళ్లెం వేసే లక్ష్యాలను చేరుకునేందుకు తమ వాటాగా.. అభివృద్ధి చెందిన దేశాలు సమకూర్చాల్సిన నిధుల గురించి నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ గట్టిగా ప్రస్తావించారు. సభ్య దేశాలన్నీ కలిసి అభివృద్ధి చెందాలనేదే భారత్ ఉద్దేశమని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి