డిజిటల్‌ రంగంలోనూ అసమానతలు

భారతదేశంలో రోజురోజుకు తీవ్రమవుతున్న కుల, మత, లింగ, తరగతి, ప్రాంతాల ఆధారిత అసమానతలు డిజిటల్‌ రంగంలోనూ ప్రతిబింబిస్తున్నాయని తాజా నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తంచేసింది.

Published : 06 Dec 2022 04:59 IST

ఆక్స్‌ఫామ్‌ ఇండియా నివేదిక

దిల్లీ: భారతదేశంలో రోజురోజుకు తీవ్రమవుతున్న కుల, మత, లింగ, తరగతి, ప్రాంతాల ఆధారిత అసమానతలు డిజిటల్‌ రంగంలోనూ ప్రతిబింబిస్తున్నాయని తాజా నివేదిక ఒకటి ఆందోళన వ్యక్తంచేసింది. 2021లో దేశంలో పురుషుల్లో 61 శాతం మందికి సొంత మొబైల్‌ ఫోన్లు ఉండగా, మహిళల్లో 31 శాతం మందికే ఉండడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ మేరకు ‘ఇండియా ఇనీక్వాలిటీ రిపోర్ట్‌ 2022: డిజిటల్‌ డివైడ్‌’ పేరుతో ఆక్స్‌ఫామ్‌ ఇండియా ఓ నివేదికను విడుదలచేసింది. డిజిటల్‌ పరిజ్ఞానాలు పట్టణ ప్రాంతాల్లోని పురుషులు, ఉన్నత కులాలకు చెందినవారికి, ఉన్నత వర్గాల వారికి ఎక్కువగా అందుబాటులో ఉంటున్నట్లు తెలిపింది.  జనరల్‌ కేటగిరీల్లోని కులాల్లో 8 శాతం కుటుంబాలు, వ్యక్తులకు కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ ఉంటే షెడ్యూల్డ్‌ కులాల్లో 2 శాతం, షెడ్యూల్డ్‌ తెగల్లో 1 శాతానికే అవి అందుబాటులో ఉన్నాయి.

* జనవరి 2018 నుంచి డిసెంబరు 2021 వరకు జరిగిన భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ (సీఎంఐఈ) కుటుంబ సర్వే గణాంకాలతోపాటు జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) విశ్లేషణలనూ పరిగణనలోకి తీసుకుని ఆక్స్‌ఫామ్‌ ఇండియా అసమానతల నివేదికను వెలువరించింది.

* 2021లో పూర్తికాల వేతన ఉద్యోగుల్లో 95 శాతం మందికి మొబైల్‌ ఫోన్లు ఉంటే, నిరుద్యోగుల్లో 50 శాతం మందికి మాత్రమే ఫోన్లు ఉన్నాయి. కొవిడ్‌-19 మహమ్మారికి ముందు గ్రామాల్లో 3 శాతం జనాభాకు కంప్యూటర్లు ఉండగా మహమ్మారి తరువాత అది 1 శాతానికి తగ్గింది. అదే పట్టణాల్లో 8% మందికి కంప్యూటర్లు ఉన్నాయి.

*  విద్య, వైద్యం తదితర రంగాలు డిజిటల్‌ విధానంలోకి మారుతున్న ఈ రోజుల్లో డిజిటల్‌ అసమానతలు తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి. ప్రజల ఆదాయాలను పెంచడానికి ప్రభుత్వం నడుంబిగిస్తే డిజిటల్‌ అసమానతలను తొలగించవచ్చని ఆక్స్‌ఫామ్‌ ఇండియా ఈ సందర్భంగా సూచించింది. గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌, వైఫై సౌకర్యాలను విస్తరించాలని సిఫార్సు చేసింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు