తాజ్‌మహల్‌ చరిత్రను మేమెలా నిర్ధారిస్తాం

ఆగ్రాలోని ప్రముఖ కట్టడమైన తాజ్‌మహల్‌కు సంబంధించిన చరిత్రను చరిత్రకారులు తప్పుగా నమోదు చేశారని, దీన్ని సరిదిద్దాలని వేసిన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Updated : 06 Dec 2022 08:11 IST

 పిల్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: ఆగ్రాలోని ప్రముఖ కట్టడమైన తాజ్‌మహల్‌కు సంబంధించిన చరిత్రను చరిత్రకారులు తప్పుగా నమోదు చేశారని, దీన్ని సరిదిద్దాలని వేసిన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. తాము ఇక్కడ చరిత్రను తెరవడానికి లేమని పేర్కొంది. అభ్యంతరాలుంటే భారత పురాతత్వ విభాగానికి(ఏఎస్‌ఐ) విన్నవించుకోవాలని పిటిషనర్‌కు సూచించింది.‘‘చరిత్రకు సంబంధించి ఏది తప్పో.. ఏది ఒప్పో మేమెలా నిర్ధారిస్తాం’’ అని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. తాజ్‌మహల్‌ వాస్తవ చరిత్రను నిర్ధారించాలని, అందులో మూసివేసిన గదులను తెరవాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను కూడా రెండు నెలల క్రితం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ప్రపంచంతో పాటు సీబీఐ మారాలి

సాంకేతిక పరంగా ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ కూడా వాటిని అందిపుచ్చుకోవాలని సోమవారం సుప్రీంకోర్టు సూచించింది. వ్యక్తిగత డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ సాధనాలను.. అందులో డేటాను జప్తు, తనిఖీ, భద్రపరచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు రూపొందించుకొనేలా విచారణ సంస్థలకు ఆదేశాలివ్వాలంటూ వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకా ధర్మాసనం విచారించింది. సీబీఐ నిబంధనావళిని తాము చూశామని, దాన్ని ఉన్నతీకరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

పంజాబ్‌లో డ్రగ్స్‌, నకిలీ మద్యంపై ఆందోళన

పంజాబ్‌లో డ్రగ్స్‌, నకిలీ మద్యం తయారీ, రవాణా సమస్యపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశాన్ని నాశనం చేయాలనుకొనే బయటి శక్తులు సరిహద్దు ప్రాంతాలపై దృష్టి పెడతాయని, అక్కడ యువతను చెడుమార్గంలోకి నెట్టే ప్రయత్నం చేస్తాయని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ‘‘ఎక్సైజ్‌ యాక్ట్‌ ప్రకారం రాష్ట్రంలో ఎన్నో ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయి. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా..? నకిలీ మద్యం తయారీ, రవాణాను ఎందుకు అరికట్టలేకపోతున్నారు. పంజాబ్‌ సరిహద్దు రాష్ట్రం. డ్రగ్స్‌తో యువతను నిర్వీర్యం చేయడం చాలా సులభం. అందువల్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని పేర్కొంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు