సంక్షిప్త వార్తలు(4)

శీతాకాలంలో మంచు కారణంగా రైళ్లు ఆలస్యం కాకుండా చూడడానికి వాటి గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 60 కి.మీ. నుంచి 75 కి.మీ.కి పెంచాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

Updated : 07 Dec 2022 06:05 IST

మంచుతో ఆలస్యం కాకుండా రైళ్ల గరిష్ఠ వేగ పరిమితి పెంపు

దిల్లీ: శీతాకాలంలో మంచు కారణంగా రైళ్లు ఆలస్యం కాకుండా చూడడానికి వాటి గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 60 కి.మీ. నుంచి 75 కి.మీ.కి పెంచాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మంచు ప్రభావిత ప్రాంతాల్లో నడిచే రైళ్ల ఇంజిన్లకు ఉండే ప్రత్యేక పరికరాల కారణంగా ఇది సాధ్యమవుతుందని తెలిపింది. డ్రైవర్లను (లోకోపైలట్లను) మరింత అప్రమత్తం చేసేలా తగిన చర్యలు చేపట్టాలని, సూచికలు స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తపడాలని జోన్లకు తెలిపింది. చివరి బోగీని తెలిపేలా వాటి వెనకభాగంలో సాధారణ ఎర్ర లైట్ల బదులు ఎల్‌ఈడీ ఆధారిత లైట్లు అమర్చాలని సూచించింది.


5 కోట్లకు చేరనున్న పెండింగ్‌ కేసులు: రిజిజు

దిల్లీ: దేశంలో వేర్వేరు కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల సంఖ్య మరో రెండు నెలల్లో 5 కోట్లకు చేరనుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు తగ్గే అవకాశం ఉందనీ, దిగువ కోర్టుల్లో పరిస్థితే అసలైన సవాల్‌ అని అన్నారు. మంగళవారం దిల్లీ హైకోర్టులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. కొద్ది నెలల క్రితం వరకు దేశంలో పెండింగ్‌ కేసులు 4.83 కోట్లు ఉండేవని రిజిజు చెప్పారు. దిగువ కోర్టుల్లో పని భారానికి తగ్గట్టు మౌలిక వసతులు లేని విషయాన్ని గుర్తుచేశారు.


ఆశిష్‌ మిశ్ర బృందంపై అభియోగాల నమోదు
లఖింపుర్‌ ఖేరి హింస కేసు

లఖింపుర్‌ ఖేరి (యూపీ): ఆందోళన చేస్తున్న రైతుల మీదికి వాహనం నడిపి 8 మంది మరణానికి కారణమైన లఖింపుర్‌ ఖేరి ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్‌ మిశ్ర తనయుడు ఆశిష్‌ మిశ్రతోపాటు మరో 12 మందిపై స్థానిక కోర్టు అభియోగాలు నమోదు చేసింది. 2021 అక్టోబరులో జరిగిన ఈ ఘటనలో హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలతో నిందితులపై పలు సెక్షన్లు నమోదు చేశారు. కేసు తదుపరి విచారణను డిసెంబరు 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అదనపు జిల్లా జడ్జి సునీల్‌కుమార్‌ వర్మ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.


ఎన్నికల్లో పోటీ చేయకుండా ‘ఎయిడెడ్‌’ అధ్యాపకులను అడ్డుకోలేం
మేఘాలయలో రాష్ట్ర సర్కారు ఆదేశాల కొట్టివేత  

షిల్లాంగ్‌: ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలల అధ్యాపకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయ పార్టీల్లో పదవులు చేపట్టకుండా నిషేధిస్తూ మేఘాలయ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలల అధ్యాపకులు రాజకీయ కార్యకలాపాలు, సంఘాల్లో పాలుపంచుకోవద్దంటూ గత ఏడాది మార్చిలో కాన్రాడ్‌ కె. సంగ్మా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని హైకోర్టు తప్పుపట్టింది. మేఘాలయ విద్యాచట్టం-1981 ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వ ఎయిడెడ్‌ ప్రైవేటు కళాశాలలకు వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎస్‌ థాంగ్‌ఖ్యూ తన తీర్పులో స్పష్టం చేశారు. ఎయిడెడ్‌ కళాశాలల అధ్యాపకులు లాభదాయక పదవులు అనుభవిస్తున్నవారి కిందకు రారని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని