ఆకలితో ఎవరూ నిద్రపోకూడదు

‘‘జాతీయ ఆహారభద్రత చట్టం కింద ఆహారధాన్యాలు చివరి వ్యక్తి దాకా చేరేలా చూడటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత.

Published : 07 Dec 2022 04:58 IST

అందరికీ ఆహారభద్రత ప్రభుత్వ విధి: సుప్రీంకోర్టు

దిల్లీ: ‘‘జాతీయ ఆహారభద్రత చట్టం కింద ఆహారధాన్యాలు చివరి వ్యక్తి దాకా చేరేలా చూడటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రం ఏమీ చేయడం లేదని చెప్పడం మా ఉద్దేశం కాదు. కొవిడ్‌ సమయంలో అందరినీ ఆదుకొన్నారు. ఆ సహాయం ఇలాగే కొనసాగాలి. ఎవరూ ఖాళీ కడుపుతో పడుకోకూడదు అన్నది మన సంస్కృతిలోనే ఉంది’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కొవిడ్‌ సమయంలో వలస కార్మికుల దుస్థితి, లాక్‌డౌన్‌ కష్టాలకు సంబంధించిన వ్యాజ్యాన్ని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ హిమా కొహ్లీల ధర్మాసనం మంగళవారం పరిశీలించింది. ఈ-శ్రమ్‌ పోర్టల్‌ కింద నమోదు చేసుకొన్న వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల వివరాలతో తాజా పట్టికను కోర్టుకు సమర్పించాల్సిందిగా ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. సామాజిక కార్యకర్తలు అంజలి భరద్వాజ్‌, హర్ష్‌ మందర్‌, జగదీప్‌ ఛోకర్‌ల తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తన వాదన వినిపిస్తూ.. దేశ జనాభా పెరిగిందని, అందుకు అనుగుణంగా ఆహార భద్రత చట్టాన్ని  అమలు చేయకపోతే అర్హులైన ఎంతోమంది లబ్ధిదారులు అవకాశాన్ని కోల్పోతారని తెలిపారు. దేశంలో ఇటీవలి కాలంలో తలసరి ఆదాయం పెరిగిందని కేంద్రం చెబుతోందని, ప్రపంచ ఆకలి సూచికలో భారత్‌ పరిస్థితి దిగజారిందన్నారు. కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భాటి మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టం కింద అత్యధికంగా 81.35 కోట్ల లబ్ధిదారులు ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. 2011 జనాభా లెక్కలతో ఆగకుండా లబ్ధిదారుల సంఖ్యను కేంద్రం పెంచుకొంటూ పోతోందని చెప్పారు. ప్రశాంత్‌ భూషణ్‌ జోక్యం చేసుకొంటూ.. 14 రాష్ట్రాలు తమ ఆహారధాన్యాల కోటా క్షీణించినట్లు అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు