ముష్కరులకు నిధుల చేరవేతను అడ్డుకుందాం

ఉగ్రవాదులకు నిధులు అందకుండా అడ్డుకట్ట వేసేందుకు సమష్టిగా కృషిచేద్దామంటూ మధ్య ఆసియా దేశాలకు భారత జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌ పిలుపునిచ్చారు.

Published : 07 Dec 2022 05:38 IST

సమష్టి కృషితోనే సీమాంతర ఉగ్రవాదం అంతం సాధ్యం
మధ్య ఆసియా దేశాల ఎన్‌ఎస్‌ఏలతో భేటీలో డోభాల్‌ పిలుపు

దిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అందకుండా అడ్డుకట్ట వేసేందుకు సమష్టిగా కృషిచేద్దామంటూ మధ్య ఆసియా దేశాలకు భారత జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌ పిలుపునిచ్చారు. అప్పుడే సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ముష్కర కార్యకలాపాలకు అఫ్గానిస్థాన్‌ సురక్షిత స్థావరంగా మారొద్దని అభిలషించారు. భారత్‌-మధ్య ఆసియా దేశాల ఎన్‌ఎస్‌ఏల భేటీ దిల్లీలో మంగళవారం జరిగింది. డోభాల్‌తో పాటు కజఖ్‌స్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ల జాతీయ భద్రతా సలహాదారులు అందులో పాల్గొన్నారు. తుర్క్‌మెనిస్థాన్‌ తరఫున దిల్లీలోని ఆ దేశ రాయబారి హాజరయ్యారు. ఉగ్రవాద ముప్పు, అఫ్గాన్‌లో తాజా పరిస్థితులు, ప్రాంతీయ అనుసంధాన ప్రాజెక్టుల గురించి సమావేశంలో డోభాల్‌ ప్రధానంగా ప్రస్తావించారు. నిధులే ఉగ్రవాదానికి ప్రాణాధారమని.. వాటిని అడ్డుకోవడానికి ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. పాక్‌కు చెందిన జైష్‌-ఎ-మొహమ్మద్‌, లష్కర్‌-ఎ-తయిబా వంటి ముష్కర సంస్థలు అఫ్గాన్‌ను తమ అడ్డాగా మార్చుకొని ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించే ముప్పుందని మన దేశం కొంతకాలంగా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో డోభాల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మధ్య ఆసియా దేశాలతో అనుసంధానానికి భారత్‌ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందుకోసం అవసరమైన పెట్టుబడులు సమకూర్చేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు.

బీఆర్‌ఐపై అసంతృప్త గళం!

అనుసంధాన ప్రాజెక్టులు పారదర్శకంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఎన్‌ఎస్‌ఏలు ముక్తకంఠంతో నొక్కిచెప్పారు. అవి అన్ని దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేలా ఉండాలని పేర్కొన్నారు. భేటీ అనంతరం ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. అనుసంధాన ప్రాజెక్టులు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు. చైనా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ)పై అసంతృప్తితో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు