బిల్లుల్ని హడావుడిగా ఆమోదించొద్దు

పార్లమెంటులో బిల్లుల్ని ప్రవేశపెట్టి, వాటిపై ఎలాంటి చర్చ లేకుండా హడావుడిగా ఆమోదించడం తగదని విపక్షం పేర్కొంది.

Published : 08 Dec 2022 04:40 IST

వాటిని కమిటీల పరిశీలనకు పంపడం మేలు
భేటీలో పార్లమెంటు విపక్ష నేతల అభిప్రాయం

దిల్లీ: పార్లమెంటులో బిల్లుల్ని ప్రవేశపెట్టి, వాటిపై ఎలాంటి చర్చ లేకుండా హడావుడిగా ఆమోదించడం తగదని విపక్షం పేర్కొంది. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయడం కోసం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో వివిధ పార్టీల నేతలు బుధవారం సమావేశమయ్యారు. వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఆప్‌, ఎన్సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఆర్‌ఎస్‌పీలతో పాటు ఆప్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలూ దీనిలో పాల్గొన్నారు. చాలాకాలం నుంచి ఆప్‌, తృణమూల్‌ పార్టీలు కాంగ్రెస్‌కి ఎడంగానే ఉంటున్నాయి. వర్షాకాల సమావేశాల్లోనూ కాంగ్రెస్‌తో అవి కలిసి వెళ్లలేదు.

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

ధరల పెరుగుదల, నిరుద్యోగం, సరిహద్దులో భద్రతపరమైన సవాళ్లు వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. చర్చలకు నిలయంలా ఉండాల్సిన పార్లమెంటులో ప్రజా సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తామని, ఈ విషయంలో.. ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఖర్గే ట్వీట్‌ చేశారు. పార్లమెంటులో ఉన్న సంఖ్యాబలంతో బిల్లుల విషయంలో ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు. దిల్లీలో తమ పార్టీ ఎంపీలతో సమావేశానంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాల వ్యవహారాలతో సంబంధం ఉన్న కనీసం 16 బిల్లులు పార్లమెంటుకు రానున్నాయని చెప్పారు. స్థాయీ సంఘాలు, సెలక్ట్‌ కమిటీలు ఇచ్చే నివేదికలను ప్రభుత్వం ఆమోదించడం లేదన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని