కొత్త ఎంపీల ఆవేదన అర్థం చేసుకోండి

పార్లమెంటు చర్చల్లో పాల్గొనే అవకాశాన్ని తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వారికీ ఇవ్వాలని రాజకీయ పార్టీలకు  ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

Published : 08 Dec 2022 04:40 IST

పార్లమెంటు సమావేశాల ఫలప్రదానికి సహకరించండి
రాజకీయ పార్టీలకు నరేంద్ర మోదీ విజ్ఞప్తి

దిల్లీ: పార్లమెంటు చర్చల్లో పాల్గొనే అవకాశాన్ని తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వారికీ ఇవ్వాలని రాజకీయ పార్టీలకు  ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో తరువాతి తరాన్ని సిద్ధం చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఉభయ సభలు అంతరాయంలేకుండా కొనసాగినప్పుడే యువ ఎంపీలకు మాట్లాడే అవకాశం వస్తుందని తెలిపారు. బుధవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. చట్టసభల సమావేశాలు సజావుగా, ఫలప్రదంగా కొనసాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తరచూ ఆటంకం కలగడం వల్ల చర్చల్లో పాల్గొనలేకపోతున్నామని పలువురు కొత్త ఎంపీలు తనకు చెప్పారన్నారు. వారి ఆవేదనను రాజకీయ పక్షాలు అర్థం చేసుకోవాలని ప్రధాని మోదీ కోరారు.

ధన్‌ఖడ్‌ సమర్థుడు

నూరేళ్ల పండగ (అమృత కాలం) దిశగా పయనిస్తున్న స్వతంత్ర భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్లడంతో పాటు ప్రపంచానికి మార్గనిర్దేశం చేయడంలోనూ కీలకపాత్ర వహిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన బుధవారం రాజ్యసభ నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు స్వాగతం పలుకుతూ ఎగువసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అనేక బాధ్యతలను ధన్‌ఖడ్‌ సమర్థంగా నిర్వర్తించారని తెలిపారు. ఆయన నేతృత్వంలో ఎగువసభ..దేశ ప్రజల కలల సాకారానికి శక్తిమంతమైన వేదికగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మన దేశం అమృత కాలంలోకి ప్రయాణాన్ని ప్రారంభించిన సమయంలోనే జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే అదృష్టం లభించింది. జీ20 కేవలం దౌత్య సమావేశం మాత్రమే కాదు. మన దేశ సత్తాను ప్రపంచానికి చాటేందుకు వచ్చిన అద్భుత అవకాశం’ కూడా అని మోదీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని