భారత్‌కు వడగాడ్పుల ముప్పు

రానున్న కొన్ని దశాబ్దాల్లో తీవ్రమైన వడగాడ్పులు, వేడి వాతావరణం భారత్‌లో ప్రజల ఆయుర్దాయాన్ని తగ్గించడంతో పాటు వేల మరణాలకు కారణం కానున్నట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది.

Published : 08 Dec 2022 04:40 IST

ఆయుర్దాయం, ఆదాయంపై పెనుప్రభావం
శీతలీకరణ చర్యలు అత్యవసరం
ప్రపంచ బ్యాంకు నివేదిక

తిరువనంతపురం: రానున్న కొన్ని దశాబ్దాల్లో తీవ్రమైన వడగాడ్పులు, వేడి వాతావరణం భారత్‌లో ప్రజల ఆయుర్దాయాన్ని తగ్గించడంతో పాటు వేల మరణాలకు కారణం కానున్నట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది. ఈ కారణంగా మనిషి మనుగడ కాలం తగ్గిపోవడంలో భారత్‌ ప్రపంచంలోనే తొలి స్థానానికి చేరుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. ‘భారత శీతలీకరణ రంగంలో వాతావరణ పెట్టుబడుల అవకాశాలు’ అన్న పేరుతో ప్రపంచ బ్యాంకు ఈ మేరకు నివేదిక రూపొందించింది. ‘వాతావరణం, ప్రగతి భాగస్వాముల సమ్మేళనం’ పేరిట తిరువనంతపురంలో రెండు రోజుల పాటు జరగనున్న సదస్సులో ఈ నివేదిక విడుదల చేయనుంది. ఇందులో పలు ఇతర సంస్థల అధ్యయనంలోని పరిశీలనాంశాలను ప్రస్తావించింది.

* 2022 ఏప్రిల్‌లో ముందస్తు వేసవి గాలులు జనజీవితాన్ని స్తంభింపజేశాయి. దిల్లీలో ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పెరిగింది. అసాధారణంగా మార్చిలోనే ఎప్పుడూ లేనంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది యావత్‌ దక్షిణాసియాపై ప్రభావం చూపనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

* 2021 ఆగస్టులో వాతావరణ మార్పులపై ఐపీసీసీ రూపొందించిన ఆరో అంచనా నివేదిక తదుపరి దశాబ్దాల్లో భారత ఉపఖండం తరచూ ఊష్ణగాలులతో సతమతం కానుందని హెచ్చరించింది.

* దేశంలో కర్బన ఉద్గారాలు ఇదే రీతిలో వెలువడితే 2036-65 నాటికి భారత్‌లో వడగాడ్పులు 25 రెట్లు తీవ్రతరం కానున్నాయని 2021లో జీ-20 శీతోష్ణస్థితుల మార్పు నివేదిక పేర్కొంది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడనుందని తెలిపింది.

* దేశ శ్రామికవర్గంలో 75 శాతం అంటే సుమారు 38 కోట్ల మంది ప్రాణహాని పొంచి ఉన్న వేడి ప్రభావానికి లోనయ్యే చోటే పనిచేస్తున్నారు. వేడి తీవ్రత వల్ల పరిశ్రమల్లో ఉత్పాదకత పడిపోయి ఉద్యోగాల్లో కోతలు అనివార్యం కానున్నాయి. అలా, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనుండగా, ఆ సంఖ్య భారత్‌లోనే 3.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

* దక్షిణాసియా దేశాల్లో ఊష్ణగాలుల ధాటికి శ్రామిక శక్తి ఉత్పాదకత క్షీణించనుంది. ఏటా పది వేల కోట్ల పని గంటలు వృథా కానున్నాయి. శ్రామికశక్తి తగ్గుదలతో ఈ దశాబ్దం చివరి నాటికి దేశ జీడీపీలో 4.5శాతం ప్రమాదంలో పడనుందని ప్రముఖ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ మెక్‌కెన్సీ అండ్‌ కంపెనీ నివేదించింది.

* ప్రపంచంలో టీకాల తయారీలో మూడో స్థానంలో ఉన్న ఇండియా.. కొవిడ్‌ ముందువరకు సరైన శీతలీకరణ చర్యలపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా సరఫరా గొలుసుల్లో శీతలీకరణ దశలు లోపించి 20 శాతం మందులు, 25 శాతం టీకాలు వృథా అయ్యాయి.

* ప్రస్తుతం దేశంలో 8 శాతం ఇళ్లకు మాత్రమే ఎయిర్‌ కండిషనింగ్‌ సౌకర్యం ఉంది. సరిపడా గాలి వెలుతురుకు నోచుకోని పేద కుటుంబాలు ఫ్యాన్లు కూడా సమకూర్చుకోలేకపోతున్నాయి. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసే ఈ ప్రభావంపై సరైన శీతలీకరణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని