సంక్షిప్త వార్తలు (4)

బిహార్‌లోని పట్నా విమానాశ్రయం నుంచి అస్సాంలోని గువాహటికి వెళ్లాల్సిన ఫ్లైబిగ్‌ విమానం (ఎఫ్‌ఎల్‌జీ 219) ఇంజినులో ఇంధనం కారుతున్నట్లు టేకాఫ్‌ దశలో తెలియడంతో రద్దు చేశారు.

Updated : 08 Dec 2022 07:11 IST

ఇంజినులో ఇంధనం లీకేజీతో విమానం రద్దు

పట్నా: బిహార్‌లోని పట్నా విమానాశ్రయం నుంచి అస్సాంలోని గువాహటికి వెళ్లాల్సిన ఫ్లైబిగ్‌ విమానం (ఎఫ్‌ఎల్‌జీ 219) ఇంజినులో ఇంధనం కారుతున్నట్లు టేకాఫ్‌ దశలో తెలియడంతో రద్దు చేశారు. ఆ సమయంలో విమానంలో ఉన్న 66 మంది ప్రయాణికులు ఏమైందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇందులో అస్సాంలోని కామాఖ్య ఆలయానికి వెళుతున్న ప్రయాణికులు, పరీక్షల నిమిత్తం బయలుదేరిన విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ ఎయిర్‌లైన్‌ సర్వీసు తరఫున పట్నాలోని పలు హోటళ్లలో బస కల్పించారు.


బాబ్రీ మసీదు కేసులో తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతాం

ఏఐఎంపీఎల్‌బీ ప్రకటన

అయోధ్య: బాబ్రీ మసీదు కూల్చివేత నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళతామని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) ప్రకటించింది. 1992లో మసీదు కూల్చివేత ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పును సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు బుధవారం ఏఐఎంపీఎల్‌బీ అధికార వర్గాలు తెలిపాయి. మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ సహా 32 మంది ‘బాబ్రీ’ కేసులో నిర్దోషులు అంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2020, సెప్టెంబరు 21న కీలక తీర్పును ఇచ్చిన దరిమిలా.. దీనిపై అయోధ్యకు చెందిన హాజీ మెహబూబ్‌, సయ్యద్‌ అఖ్లాక్‌లు 2021, జనవరి 8న అలహాబాద్‌ హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, అప్పీలువేసిన ఇద్దరూ ఈ కేసులో బాధితులు కానందున తీర్పును సవాల్‌ చేసే హక్కు వారికి లేదని స్పష్టం చేస్తూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ ఏడాది నవంబరు 9న ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌, అధికార ప్రతినిధి సయ్యద్‌ ఖురేషీ రసూల్‌ తెలిపారు.


చికెన్‌ దుకాణాలను కొల్లగొడుతున్న ఎలుగుబంట్లు

డవులకు సమీపంలో ఉన్న గ్రామాలకు ఎలుగుబంట్లు వచ్చి మనుషులపై దాడి చేసిన ఘటనలు మనకు తెలుసు. ఉత్తరాఖండ్‌లోని పౌఢీ-కోట్‌ద్వార్‌ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఆగ్రోడా కస్బా ప్రాంతంలో మాత్రం ఎలుగుబంట్లు మాంసాహార దుకాణాలపై దాడి చేస్తున్నాయి. అక్కడ ఉన్న కోళ్లు, చేపల్ని తినేస్తున్నాయి. ఆ తర్వాత దుకాణ పరిసరాల్లో రచ్చరచ్చ చేస్తున్నాయి. దీంతో మాంసం వ్యాపారులు లోబోదిబోమంటున్నారు. అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.


సంఘర్షణలతో మహిళలకు మరింత ముప్పు

ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచం సుదీర్ఘమైన, తీవ్రమైన సంఘర్షణలను ఎదుర్కొంటోంది. దీనివల్ల లక్షల మంది మహిళలు, బాలికలు హింసకు గురయ్యే ముప్పు పెరుగుతోంది. శరణార్థులుగా మారిన ప్రతి అయిదుగురు మహిళల్లో ఒకరిపై లైంగిక హింస జరుగుతోంది. బాధితులను గుర్తించి సంరక్షించడానికి అవసరమైన శిక్షణను ఆరోగ్య కార్యకర్తలకు అందించాలి.


మా భద్రత ప్రమాదంలో పడింది

మల్లికార్జున ఖర్గే

ప్రధాని మోదీజీ.. మా భద్రత ప్రమాదంలో పడింది. దిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రిపై సైబర్‌ దాడి కారణంగా 14 రోజులుగా నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి కూడా హ్యాకర్ల బారిన పడింది. ఇప్పుడు ఐసీఎంఆర్‌ డేటాబేస్‌లో చొరబడటానికి 24 గంటల్లో ఆరు వేల సార్లు యత్నించారు. ఇంత జరుగుతున్నా భాజపా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది.


ఆప్‌ అవినీతి మంత్రులకు గుణపాఠం

సంబిత్‌ పాత్రా

దిల్లీ మున్సిపల్‌    కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటర్లు ఆప్‌ ప్రభుత్వ అవినీతి మంత్రులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. సత్యేందర్‌ జైన్‌, మనీశ్‌ సిసోదియా, కైలాశ్‌ గహ్లోత్‌ల సొంత నియోజకవర్గాల్లో చీపురు పార్టీకి వచ్చిన దారుణ ఫలితాలే అందుకు నిదర్శనం. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి 12 శాతం ఓట్లు తగ్గిపోయాయి.


జీవవైవిధ్య విధ్వంసాన్ని అడ్డుకోవాలి

ఐరాస అభివృద్ధి సంస్థ

భూమిపైన మానవ జీవితం జీవవైవిధ్యంతో అనుసంధానమై ఉంది. అయినప్పటికీ దాన్ని ధ్వంసం చేసే చర్యలను అడ్డుకొనే ప్రయత్నాలు జరగడం లేదు. ఈ విధానం మారకపోతే విధ్వంసం తప్పదు.


చిత్ర వార్త

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు