ఆ క్యూరేటివ్‌ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

కశ్మీరీ పండిట్ల సామూహిక హత్యల (1989-1990లో)పై దర్యాప్తు అంశానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ 2017లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాల్సిందిగా కోరుతూ.

Published : 09 Dec 2022 05:37 IST

 కశ్మీరీ పండిట్ల సంస్థ దాఖలు..

దిల్లీ: కశ్మీరీ పండిట్ల సామూహిక హత్యల (1989-1990లో)పై దర్యాప్తు అంశానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ 2017లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాల్సిందిగా కోరుతూ.. ఓ సంస్థ దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించింది. క్యూరేటివ్‌ పిటిషన్‌ను, సంబంధిత పత్రాలను పరిశీలించిన మీదట ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి కేసూ లేనందున దీన్ని కొట్టివేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కశ్మీరీ పండిట్లకు చెందిన ‘రూట్స్‌ ఇన్‌ కశ్మీర్‌’ అనే సంస్థ ఈ క్యూరేటివ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. 1989-90, 1997, 1998ల్లో కశ్మీరీ పండిట్ల హత్యలపై దర్యాప్తు కోరడంతో పాటు కొందరు వ్యక్తులను ప్రాసిక్యూట్‌ చేయాలంటూ ఈ సంస్థ గతంలో సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. అలాగే సంబంధిత కేసులన్నింటి విచారణను సీబీఐ, ఎన్‌ఐఏ లేదా సుప్రీం నియమించిన ఏదైనా ఇతర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని నాటి వ్యాజ్యంలో కోరింది. వందల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదని వ్యాజ్యంలో పేర్కొంది. ఆ వ్యాజ్యాన్ని 2017లో సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం ఈ వ్యవహారంపై దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను పునఃపరిశీలించాల్సిందిగా కోరుతూ ఆ సంస్థ క్యూరేటివ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు