సంక్షిప్త వార్తలు(5)

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3.25 లక్షల కోట్ల అదనపు వ్యయానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటును కోరింది.

Updated : 10 Dec 2022 06:32 IST

రూ.3.25 లక్షల కోట్ల అదనపు వ్యయానికి అనుమతించండి
పార్లమెంటును కోరిన కేంద్రం

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3.25 లక్షల కోట్ల అదనపు వ్యయానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటును కోరింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 39.45 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. ఈ బడ్జెట్‌లోనే అదనపు వ్యయం చేయడానికి అనుమతి ఇవ్వాలని పార్లమెంటుకు ప్రతిపాదించింది. ప్రభుత్వం అనుమతి కోరిన మొత్తంలో ఎరువుల రాయితీకి సంబంధించే రూ.1.09  లక్షల కోట్లు ఉన్నాయి. ఇంకా పేదలకు ఆహార ధాన్యాల పంపిణీ కోసం రూ.80,348.25 కోట్లు, సిలిండర్ల పంపిణీ, ఇతరాల కోసం రూ.29,944 కోట్లు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.46,000 కోట్లు, టెలికాం, రైల్వే శాఖల్లో వరుసగా 13,669 కోట్లు, రూ.12,000 కోట్లు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధికి అదనంగా వ్యయం చేయడానికి రూ.13,500 కోట్లు అనుమతించాలని పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం వివరించింది.


మతంతో సంబంధం లేకుండా వివాహ వయసు ఏకరీతిగా ఉండాలి

సుప్రీంకోర్టులో జాతీయ మహిళా కమిషన్‌ పిటిషన్‌

దిల్లీ: మతంతో సంబంధం లేకుండా మహిళల వివాహ వయసు ఏకరీతిగా ఉండేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) వేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఒక్క ఇస్లాంలో తప్ప మిగతా అన్ని మతాలకు చెందిన చట్టాల్లో వివాహ వయసు ప్రస్తుత శిక్షా చట్టాలకు అనుగుణంగా ఉందని ఎన్‌సీడబ్ల్యూ తన పిటిషన్‌లో పేర్కొంది. ముస్లిం పర్సనల్‌ లా మాత్రం.. రజస్వల కాగానే బాలికల వివాహాలకు అనుమతిస్తోందని.. ఇది పోక్సోలాంటి ప్రస్తుత శిక్షా చట్టాలకు వ్యతిరేకంగా ఉందని తెలిపింది.


పండగలతో అల్లర్లు చెలరేగుతాయనడం సరికాదు: సుప్రీం

దిల్లీ: మతపరమైన ఊరేగింపులు ఘర్షణలకు దారి తీస్తాయనడం సరైంది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘పండగల కారణంగా అల్లర్లు జరుగుతాయని ఎందుకు చిత్రిస్తున్నారు. వాటితో దేశంలో జరుగుతున్న మంచిని కూడా చూడండి. మహారాష్ట్రలో గణేశ్‌పూజ సందర్భంగా లక్షల మంది హాజరవుతారు. ఎక్కడా ఘర్షణలు జరగవు’’ అని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు. కత్తులు, తుపాకులు ప్రదర్శిస్తూ చేసే మతపరమైన ఊరేగింపులకు అనుమతిచ్చే విషయంలో విధివిధానాలు రూపొందించాలంటూ సామాజిక ఉద్యమకారిణి తీస్తా సీతల్వాడ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.


అవినీతికి తొలి సమిధలు సామాన్యులే : పి.కె. మిశ్ర

ఈనాడు, దిల్లీ: అవినీతి ఏ రూపంలో ఉన్నా ప్రజల హక్కులను అది హరిస్తుందని, దేశ భద్రతకూ ముప్పుగా పరిణమిస్తుందని ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ పి.కె.మిశ్ర హెచ్చరించారు. ఈ మహమ్మారికి తొలుత సమిధలయ్యేది సామాన్యులేనన్నారు. అవినీతిని నిర్మూలించడానికి ప్రతిఒక్కరూ నడుంబిగించాలని ఆయన పిలుపునిచ్చారు. సీబీఐ ఆధ్వర్యంలో శుక్రవారం దిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం-2022లో మిశ్ర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో ఆయన సీబీఐకి చెందిన 34 మంది సిబ్బందికి ప్రతిభాపురస్కారాలు అందజేశారు. వీరిలో విశాఖపట్నం సీబీఐ డీఎస్‌పీ సంజయ్‌కుమార్‌ సామల్‌, హైదరాబాద్‌ సీబీఐ హెడ్‌కానిస్టేబుల్‌ రాము గొళ్ల ఉన్నారు.




గవర్నర్‌ అధికారాలపై రాజ్యాంగ సవరణ చేయండి

రాజ్యసభలో సీపీఎం సభ్యుడి ప్రైవేటు బిల్లు

దిల్లీ: గవర్నర్ల అధికారాలు, పాత్రను నిర్వచిస్తూ రాజ్యాంగానికి సవరణ చేయాలని కోరుతూ సీపీఎం సభ్యుడు వి.శివదాసన్‌ శుక్రవారం రాజ్యసభలో ప్రైవేటు సభ్యుల బిల్లును ప్రవేశపెట్టారు. గవర్నర్‌ పదవిని కేంద్రం దుర్వినియోగం చేస్తూ.. తన ఎజెండాను ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలపైకి ప్రయోగిస్తోందని ఆరోపించారు. బ్రిటీష్‌ వలసకాలం నాటి గవర్నర్‌ పదవి భారతీయుల అణచివేతకు ఉపయోగపడిందని, దాని అధికారాల్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని