పైవంతెనలను డీపీఆర్‌ దశలోనే చేర్చాలి

జాతీయ రహదారులపై పైవంతెనలు (ఫ్లైఓవర్లు), అండర్‌ పాస్‌లు ఎక్కడ నిర్మించాలనేది సమగ్ర ప్రాజెక్టు నివేదికలోనే (డీపీఆర్‌) పొందుపర్చాలని పార్లమెంటరీ రవాణా స్థాయీ సంఘం సిఫార్సు చేసింది.

Published : 10 Dec 2022 05:16 IST

మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలి
జాతీయ రహదారుల నిర్మాణంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సులు

ఈనాడు, దిల్లీ: జాతీయ రహదారులపై పైవంతెనలు (ఫ్లైఓవర్లు), అండర్‌ పాస్‌లు ఎక్కడ నిర్మించాలనేది సమగ్ర ప్రాజెక్టు నివేదికలోనే (డీపీఆర్‌) పొందుపర్చాలని పార్లమెంటరీ రవాణా స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. జాతీయ రహదారుల వెంట ఉండే ప్రతి గ్రామం/పట్టణం వద్ద డీపీఆర్‌ ప్రకారం ఆయా నిర్మాణాలు చేపడితే వాహనదారులు, పాదచారులు ఇబ్బందిపడకుండా రాకపోకలు సాగించడంతో పాటు ప్రమాద ఘటనలు తగ్గిపోతాయని అభిప్రాయపడింది. పశువులు, వన్యప్రాణులు రహదారులపైకి రాకుండా ఫెన్సింగ్‌ అమర్చాలని సూచించింది. రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించిన స్థాయీ సంఘం నివేదికను పార్లమెంటు ఎదుట ఉంచారు. జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ, భద్రత తదితర అంశాలపై స్థాయీ సంఘం పలు సిఫార్సులతో పాటు తమ పరిశీలనలు తెలియజేసింది.

* ఎన్‌హెచ్‌ల నిర్మాణ పనులను అధికారులు, ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు, ఇతర భాగస్వాములు పర్యవేక్షించేందుకు గాను నిర్ణీత కిలోమీటర్ల దూరంలో సీసీటీవీ కెమెరాలు అమర్చాలి. ఇందుకు నిధులు అవసరమైతే నిర్భయ నిధి నుంచి తీసుకోవాలి.

* జాతీయ రహదారుల మరమ్మతులు, నిర్వహణకు ఎన్‌హెచ్‌ శాఖ కోరిన నిధుల్లో 40 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. నిధుల కొరత ప్రభావం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌, మహారాష్ట్రల్లోని జాతీయ రహదారులపై బాగా కనిపిస్తోంది. నూతన నిర్మాణాల కన్నా ప్రస్తుతమున్న రహదారుల మరమ్మతులు, నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలి. సర్వీసు రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక బడ్జెట్‌ను డీపీఆర్‌ దశలోనే చేర్చాలి.

* వివిధ సంస్థలతో సమన్వయం చేసుకుని జాతీయ రహదారులన్నింటిపై అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలి. టోల్‌ప్లాజాల వద్ద హెలికాప్టర్‌ దిగేలా ఏర్పాటు చేయాలి. ఫలితంగా రోడ్డు ప్రమాద బాధితులకు త్వరగా వైద్యం అందించే వీలుంటుంది.

* మహిళా భద్రతకు సంబంధించి శాఖా పరమైన బడ్జెట్‌ తగ్గింపుపై స్థాయీ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల భద్రత విషయంలో మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.

* ఎన్‌హెచ్‌ల నిర్మాణం నిర్దేశిత కాల పరిమితిలో పూర్తికాకపోయినా, నాణ్యత లోపంతో గుంతలు పడడం వంటివి చోటు చేసుకున్నా గుత్తేదారు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా నిబంధనలు చేర్చాలి.

* దివాన్‌చెరువు-అనకాపల్లి ఆరు వరుసల రహదారి, రాజమండ్రి-రంపచోడవరం గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి (ఎన్‌హెచ్‌-516ఈ) నిర్మాణంలో ఆలస్యానికి కారణాలు తెలియజేయాలని స్థాయీ సంఘం కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని