మైక్‌ కట్‌.. కొనసాగిన దేవేెగౌడ ప్రసంగం

మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవేగౌడ తొమ్మిది పదుల వయసులోనూ నిత్యం రాజ్యసభకు హాజరవుతుంటారు. చర్చల్లో పాలుపంచుకుంటారు.

Published : 10 Dec 2022 05:24 IST

ఈనాడు, దిల్లీ: మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవేగౌడ తొమ్మిది పదుల వయసులోనూ నిత్యం రాజ్యసభకు హాజరవుతుంటారు. చర్చల్లో పాలుపంచుకుంటారు. శుక్రవారం నాటి జీరో అవర్‌లో దృశ్యం మాత్రం ఆయన స్థితిపై సభ్యులందరికీ జాలి కలిగించింది. దేవేగౌడ పేరును ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ పిలిచారు. అటువైపే చూస్తున్నా.. ఛైర్మన్‌ మాటలు వినపడకపోవడంతో మాజీ ప్రధానమంత్రి స్పందించలేదు. మరో రెండుసార్లు ఛైర్మన్‌ పిలిచినా ఆయన నుంచి స్పందన రాలేదు. ఆయనకు వినపడడం లేదని గ్రహించిన పక్కనే ఉన్న ఓ సభ్యుడు దేవేగౌడను తట్టి విషయం చెప్పారు. తాను నిలుచొని మాట్లాడే స్థితిలో లేనని, కూర్చొని మాట్లాడాతనంటూ ఆయన అనుమతి తీసుకున్నారు. కర్ణాటక పాత మైసూర్‌ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, సమస్య పరిష్కారానికి మేకదాతు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. సభలో ఎవరి మనోభావాలూ దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఆయన ప్రసంగాన్ని ఎండీఎంకే సభ్యుడు వైగో అడ్డుకున్నారు. దేవేగౌడ మాత్రం నీటి ఎద్దడి సమస్యపై మాట్లాడుతూనే ఉన్నారు. జీరో అవర్‌ ముగిసే సమయం కావడంతో త్వరగా ముగించాలంటూ ఆయనకు ఛైర్మన్‌ సంకేతమిచ్చారు. ఆ సంకేతాన్ని మాజీ ప్రధానమంత్రి అందుకోలేకపోయారు. సమయం ముగియడంతో ఛైర్మన్‌ ఆయన మైక్‌ కట్‌ చేసి ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. ఆ విషయం గ్రహించని దేవేగౌడ మాట్లాడుతూనే ఉన్నారు. సభ్యులంతా ఆయన వైపు సానుభూతిగా చూస్తూ ఉండిపోయారు. చివరకు ప్రశ్నోత్తరాలు నడుస్తున్న విషయం గ్రహించి ఆయన మాట్లాడడం ఆపేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని