Married life: వివాహబంధంలో స్మార్ట్‌ఫోన్‌ రుసరుసలు

భారతదేశంలో స్మార్ట్‌ ఫోన్ల వినియోగం దైనందిన జీవితంలో సాధారణమైపోయింది. ఆఖరికి భార్యాభర్తల మధ్య సంబంధాలను దెబ్బతీసే స్థాయిలో దీని వినియోగం ఉందని స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వివో జరిపిన అధ్యయనంలో తేలింది.

Updated : 13 Dec 2022 10:04 IST

మొబైల్‌తో ఉన్నపుడు భాగస్వామి పలకరించినా చిరాకు

దిల్లీ: భారతదేశంలో స్మార్ట్‌ ఫోన్ల వినియోగం దైనందిన జీవితంలో సాధారణమైపోయింది. ఆఖరికి భార్యాభర్తల మధ్య సంబంధాలను దెబ్బతీసే స్థాయిలో దీని వినియోగం ఉందని స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వివో జరిపిన అధ్యయనంలో తేలింది. సైబర్‌ మీడియా రీసెర్చ్‌ సంస్థతో కలసి ‘స్విచాఫ్‌’ శీర్షికన వివో జరిపిన సర్వేలో 67 శాతం మంది వినియోగదారులు తమ జీవిత భాగస్వామి పక్కనే ఉన్నా స్మార్ట్‌ ఫోన్లను వాడుతున్నామని ఒప్పుకొన్నారు. ఖాళీగా ఉన్నా జీవిత భాగస్వామితో మాటామంతీ జరపడం లేదని ఏకంగా 89 శాతం మంది అంగీకరించారు. ఫోన్లను మితిమీరి వాడటం వల్ల జీవిత భాగస్వామితో సంబంధాలు దెబ్బతింటున్నాయని 88 శాతం మంది వాపోయారు. వారితో మరింత అందమైన సమయం గడపాలని ఉందని 84 శాతం మంది కోరుకుంటున్నారు. ఫోన్లకు బానిసలుగా మారినా తమ బంధాలను పునరుద్ధరించుకోవాలనే కోరిక చాలామంది కనబరిచారని అర్థమవుతోంది.

ఖాళీగా ఉన్నా ఫోన్‌తోనే...

రోజుకు సగటున 1.5 గంటల ఖాళీ సమయం లభిస్తున్నా, ఆ సమయంలోనూ చాలా మంది ఫోన్‌ వదలడం లేదు. తమతో కాకుండా ఫోన్‌తో కాలక్షేపం చేయడంపై వివాహ బంధంలో ఉన్న 73 శాతం మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సర్వే తెలిపింది. మొబైల్‌తో ఉన్నపుడు కుటుంబ భాగస్వామి ప్రేమగా మాట్లాడినా 70 శాతం మంది చిరాకు పడుతున్నారని సర్వేలో తేలింది. హైదరాబాద్‌, దిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబయి కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్‌లలో 1,000 మంది సర్వేలో పాల్గొన్నారు. కుటుంబంతో గడపాల్సిన ఆవశ్యకతను వినియోగదారులకు గుర్తు చేయడమే తమ ఉద్దేశమని వివో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని