నగలు తాకట్టుపెట్టి ఉపకారం.. సొంతంగా వంతెన, రోడ్డు నిర్మించిన తండ్రీకొడుకులు

నదికి అవతల ఉన్న గ్రామం నుంచి రాకపోకల్లేక ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి ఓ డ్రైవర్‌ ఏకంగా వంతెననే ఏర్పాటు చేశారు. ఉపాధిని వదులుకొని, భార్య నగలు తాకట్టు పెట్టి మరీ ఊరి కోసం పాటుపడ్డారు.

Updated : 15 Dec 2022 09:57 IST

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: నదికి అవతల ఉన్న గ్రామం నుంచి రాకపోకల్లేక ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి ఓ డ్రైవర్‌ ఏకంగా వంతెననే ఏర్పాటు చేశారు. ఉపాధిని వదులుకొని, భార్య నగలు తాకట్టు పెట్టి మరీ ఊరి కోసం పాటుపడ్డారు. ఒడిశాలోని రాయగడ జిల్లా కాశీపూర్‌ సమితి డొంగశిలి పంచాయతీలోని గుంజరం పంజరి గ్రామానికి చెందిన రంజిత్‌ నాయక్‌ డ్రైవర్‌గా పని చేసేవారు. 120 కుటుంబాలు నివసించే గుంజరం పంజరి బిచులి నదికి అవతల ఉంది.

ఏ అవసరం వచ్చినా నదిలో దిగి వెళ్లాలి. అత్యవసర సమయంలో వైద్యం అందక పలువురు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. అది చూసిన రంజిత్‌ నదిపై వంతెన నిర్మించాలనుకున్నారు. ఉపాధిని పక్కన పెట్టి, భార్య బంగారాన్ని తాకట్టు పెట్టారు. వచ్చిన రూ.70 వేలతో కర్రలతో వంతెన నిర్మిస్తానని తండ్రికి చెప్పారు. కుమారుడి లక్ష్యం నచ్చిన ఆ పెద్దాయనా అతనికి సాయంగా పనిలోకి దిగారు. ఇద్దరూ కలసి నదిపై కర్రల వంతెన నిర్మించారు. నది దగ్గర నుంచి ఊరిలోకి వెళ్లేందుకు పొదలు తొలగించి, 4 కి.మీ. మేర మట్టి రోడ్డు వేశారు. నాలుగు నెలలు శ్రమించి గ్రామానికో రోడ్డేశారు. ‘దారి వేయాలని అధికారులు చుట్టూ తిరిగి అలసిపోయా. అందుకే కర్రల వంతెన, రోడ్డు నిర్మించా’ అని రంజిత్‌ తెలిపారు. ఈ విషయంపై ‘న్యూస్‌టుడే’ సమితి అధికారి మోనిసా దాస్‌ను సంప్రదించగా.. వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని