Population: భారత్‌లో జనాభాపై జర్మనీ వ్యంగ్యంగా కార్టూన్‌.. మండిపడ్డ నెటిజన్లు!

భారత్‌లో జనాభా పెరుగుదలను ఉద్దేశిస్తూ జర్మనీ (Germany)కి చెందిన మ్యాగజీన్‌ ప్రచురించిన కార్టూన్‌ (Cartoon)పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది భారత్‌ను అవమానకరంగా చిత్రీకరించే ప్రయత్నమని విమర్శిస్తున్నారు. 

Published : 26 Apr 2023 01:36 IST

దిల్లీ: భారత్‌లో జనాభా పెరుగుదలపై జర్మనీ (Germany)కి చెందిన మ్యాగజీన్‌ ఆర్టిస్ట్‌ ఒకరు గీసిన కార్టూన్‌ (Cartoon) పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. డేర్‌ స్పేజెల్‌ (Der Spiegel) అనే జర్మనీ మ్యాగజీన్‌ భారత్‌లో జనాభా పెరుగుదలను ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ఒక కార్టూన్‌ను ప్రచురించింది. అందులో భారతీయులతో కిక్కిరిసిన రైలు.. చైనా బుల్లెట్‌ ట్రైన్‌ను దాటి వెళుతుంటే.. అందులోని లోకో పైలట్లు భారత్‌ రైలును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లుగా చూపించారు. ఈ కార్టూన్ చూసిన నెటిజన్లు ‘జర్మనీ జాత్యహంకారానికి ఇది నిదర్శనం’, ‘భారత్‌ను అవమానకరంగా చిత్రీకరించే ప్రయత్నం’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (Rajeev Chandrasekhar) కూడా దీనిపై స్పందించారు. ‘‘ భారత్‌ను అపహాస్యం చేసేందుకు మీరు ఎంత ప్రయత్నించినా.. ప్రధాని మోదీ నాయకత్వంలో మరి కొన్నేళ్లలో జర్మనీ కంటే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుంది’’ అని ట్వీట్ చేశారు. ఆయనతోపాటు పలువురు ప్రభుత్వ సలహాదారులు, పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ కార్టూన్‌ను తప్పుబట్టారు. చైనా మెప్పు కోసమే జర్మనీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సైతం ఈ కార్టూన్‌పై స్పందించారు. ‘‘ విదేశీయులు ఎప్పుడూ భారత్‌ను పేద దేశంగానే చూపిస్తుంటారు. వందే భారత్‌ రైలు వంటివి వారికి కనిపించవు. జర్మనీ ఆర్థిక వ్యవస్థను భారత్‌ అధిగమించి, నాలుగో అతిపెద్ద జీడీపీగా ఎదిగే సమయం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటాను’’ అని ట్వీట్ చేశారు. 

ఐరాస గణాంకాల ప్రకారం గతవారం జనాభాలో చైనాను భారత్‌ అధిగమించింది. ప్రస్తుతం భారత్‌ జనాభా 142.3 కోట్లు కాగా, చైనా జనాభా 141.2 కోట్లుగా ఉంది. ఈ విషయంలో కూడా భారత్‌పై చైనా తన అక్కసు వెళ్లగక్కింది. అదేమంత పెద్ద విషయం కాదని, జన సంఖ్యలో క్వాంటిటీ (సంఖ్య) కాదు.. క్వాలిటీ (నాణ్యత) చూడాలంటూ వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని