Assam Police: మూడు నెలల్లో ఫిట్‌గా మారండి.. లేదంటే స్వచ్ఛంద పదవీ విరమణే!

ఆగస్టు 15లోగా ఫిట్‌గా మారాలని అస్సాం పోలీసు శాఖ సిబ్బందిని ఆదేశించింది. బరువు తగ్గనివారికి.. మరో మూడు నెలలు గడువిచ్చి, అప్పటికీ ఫలితం లేకపోతే స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇస్తామని తెలిపింది.

Published : 16 May 2023 14:29 IST

దిస్పుర్‌: పోలీసు బలగాల (Police Force)కు ఫిట్‌నెస్‌ (Fitness) ఎంతో కీలకం. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పోలీసు బలగాలను మరింత ఫిట్‌గా మార్చేందుకు అస్సాం (Assam) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు నెలల్లోగా ఐపీఎస్‌లతోసహా పోలీసులందరూ (Assam Police) తమ శరీరాన్ని ఫిట్‌గా మార్చుకోవాలని సూచించింది. ఈ మేరకు వారి బీఎంఐ (BMI)ని లెక్కగట్టనుంది. బరువు తగ్గనివారికి.. మరో మూడు నెలలు అవకాశమిచ్చి, అప్పటికీ ఫలితం లేకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) దిశగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అస్సాం డీజీపీ (Assam DGP) జీపీ సింగ్‌ ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు.

‘ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఐపీఎస్‌, ఏపీఎస్‌ (అస్సాం పోలీస్‌ సర్వీస్‌) అధికారులతోసహా అన్ని విభాగాలకు చెందిన పోలీసుల బాడీ మాస్ ఇండెక్స్ (BMI) నమోదు చేయాలని నిర్ణయించాం. ఆగస్టు 15 వరకు అందరికి మూడు నెలల సమయం ఇచ్చి.. ఆ తర్వాత బీఎంఐ లెక్కింపు చేపడతాం. ఊబకాయం (BMI 30+) కేటగిరీలో ఉన్న వారందరికీ బరువు తగ్గించుకునేందుకు మరో మూడు నెలల గడువు ఇస్తాం. అప్పటికీ ఫిట్‌గా మారకపోతే.. థైరాయిడ్‌ సమస్య తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మినహా మిగతా వారికి స్వచ్ఛంద పదవీ విరమణ ఆప్షన్‌ ఇస్తాం. అస్సాం డీజీపీనే ఆగస్టు 16న మొదటగా బీఎంఐ లెక్కింపునకు హాజరవుతారు’ అని పేర్కొన్నారు.

అస్సాంలో దాదాపు 70 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. అయితే, విధులకు పనికిరాని సిబ్బందిని ఇంటికి పంపేందుకు పోలీసు విభాగం కార్యాచరణ ప్రారంభించింది. మద్యానికి బానిసలుగా మారిన, ఊబకాయంతో బాధపడుతున్న, విధులకు అనర్హులుగా తేలిన 680 మందికిపైగా సిబ్బందితో కూడిన ఓ జాబితాను ఇప్పటికే రూపొందించింది. పూర్తి స్థాయి సమీక్ష అనంతరం వారికి వీఆర్‌ఎస్‌ ఆప్షన్‌ ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులందరిని ఫిట్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని