Angela Merkel: జర్మనీ ఛాన్స్‌లర్‌గా మెర్కెల్‌ చివరి పాడ్‌కాస్ట్‌.. టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి

జర్మనీ ఛాన్స్‌లర్‌గా 16 ఏళ్లపాటు విధులు నిర్వహించిన ఏంజెలా మెర్కెల్.. త్వరలో దేశ పగ్గాలను సోషల్ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఓలాఫ్ స్కోల్జ్‌కు అప్పగించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం మెర్కెల్‌ తన చివరి వీక్లీ వీడియో పాడ్‌కాస్ట్‌లో ప్రసంగించారు...

Published : 04 Dec 2021 23:17 IST

బెర్లిన్‌: జర్మనీ ఛాన్స్‌లర్‌గా 16 ఏళ్లపాటు విధులు నిర్వహించిన ఏంజెలా మెర్కెల్.. త్వరలో దేశ పగ్గాలను సోషల్ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఓలాఫ్ స్కోల్జ్‌కు అప్పగించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం మెర్కెల్‌ తన చివరి వీక్లీ వీడియో పాడ్‌కాస్ట్‌లో ప్రసంగించారు. దేశ పౌరులంతా విధిగా కొవిడ్‌ టీకా వేయించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ వైరస్‌ను సీరియస్‌గా తీసుకోవాలని మరోసారి అడుగుతున్నట్లు చెప్పారు. దేశంలో మొదలైన నాల్గో వేవ్‌ చాలా తీవ్రమైనదిగా అభివర్ణించారు. ప్రత్యేకించి ‘ఒమిక్రాన్‌’ వేగంగా వ్యాప్తి చెందేట్లు ఉందని చెబుతూ.. అర్హులందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ..

కరోనా కష్టకాలంలో స్వీయ రక్షణతోపాటు ఇతరులను జాగ్రత్తగా చూసుకున్నవారికి మెర్కెల్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటివారి తోడ్పాటు లేకుండా ఏ ఛాన్స్‌లర్, ఏ ప్రభుత్వం ఏమీ సాధించలేదని అన్నారు. 2006లో తన తొలి పాడ్‌కాస్ట్‌ను గుర్తుచేసుకుంటూ.. అప్పట్లో ఓ ప్రభుత్వాధినేత ఆన్‌లైన్‌లో నేరుగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం చాలా అసాధారణమైనదిగా చెప్పుకొచ్చారు. అదే ఏడాది దేశంలో జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌ ఘనంగా జరగాలని కోరుకోగా.. తన ఆశ నెరవేరినట్లు తెలిపారు. ఇప్పటివరకు 600కు పైగా పాడ్‌కాస్ట్‌లలో ప్రసంగించిన మెర్కెల్‌.. డిజిటలైజేషన్, యూదులపై వ్యతిరేకత తదితర అనేక అంశాలను ప్రస్తావించారు. గత రెండేళ్లుగా ప్రధానంగా కరోనా గురించి మాట్లాడుతూ వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని