Mehbooba Mufti: ‘భాజపాను వదిలించుకోవడం దేశ స్వాతంత్ర్యం కంటే పెద్దది’

జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తాజాగా మరోసారి భాజపాపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ వివిధ వర్గాల మధ్య విద్వేష బీజాలు నాటుతోందని ఆరోపించారు. బ్రిటిష్ పాలననుంచి విముక్తి కంటే కాషాయ పార్టీని వదిలించుకోవడమే...

Updated : 18 Jan 2022 04:44 IST

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తాజాగా మరోసారి భాజపాపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ వివిధ వర్గాల మధ్య విద్వేష బీజాలు నాటుతోందని ఆరోపించారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కంటే కాషాయ పార్టీని వదిలించుకోవడమే పెద్దదని వ్యాఖ్యానించారు. భాజపా హయాంలో జమ్మూ-కశ్మీర్ అస్తిత్వం ప్రమాదంలో పడిందని వాపోయారు. అయితే, యువత మాత్రం అధికార పార్టీ బెదిరింపులకు వెనకడుగేయకుండా.. అహింసాయుతంగా, ప్రేమ, స్నేహా సందేశాలను చాటుతూ దేశ సవాళ్లకు దీటుగా నిలబడాలని కోరారు. పీడీపీ ఆధ్వర్యంలో సోమవారం స్థానికంగా నిర్వహించిన గిరిజన యువజన సదస్సులో ముఫ్తీ పాల్గొని ఈ మేరకు ప్రసంగించారు.

‘భాజపా నేతలు దేశాన్ని నాశనం చేశారు. ప్రతిపక్ష నేతలపై ఈడీ, ఇతర ప్రభుత్వ సంస్థల దాడులు, అరెస్టులు నిత్యకృత్యంగా మారాయి. కశ్మీర్‌ పరిస్థితి దేశంలోని మిగతా ప్రాంతాల కంటే దారుణంగా మారింది. కానీ, గుర్తుంచుకోండి.. చరిత్ర అందరికీ ఓ అవకాశాన్ని ఇస్తుంది. బ్రిటీషర్ల నుంచి విముక్తి కోసం దేశ ప్రజలు గతంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు భాజపాను వదిలించుకునేందుకు అవకాశం ఉంది. ఇది స్వాతంత్ర్యం కంటే పెద్దది.. ఎందుకంటే ఈ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తోంది’ అని అన్నారు.

జమ్మూ-కశ్మీర్ అనేది మహాత్మా గాంధీ భారత్‌లో చేరిందని.. ఈ దేశాన్ని గాడ్సే దేశంగా మార్చేందుకు అనుమతించదని ముఫ్తీ చెప్పారు. ఎన్నికలు జరగనున్న యూపీలో బాబర్, ఔరంగజేబు వంటి మొఘల్ పాలకుల పేర్లను భాజపా ప్రచారం చేస్తోందని.. పాలనలో విఫలమైనందునే గుళ్లు, మసీదుల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైన వారు.. కశ్మీర్‌ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. భాజపా హయాంలో దేశంలో పేదలు మరింత పేదలుగా మారారని, సంపన్నుల జాబితా పెరిగిపోయిందని తెలిపారు. ఇటీవల కశ్మీర్‌ లోయలో ప్రజా భద్రతా చట్టం(పీఎస్‌ఏ) కింద ఓ జర్నలిస్టును అరెస్టు చేయడంపై ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని