
Blinken on Ashraf Ghani: ‘ప్రాణాలిస్తానన్నాడు.. కానీ పారిపోయాడు’
కాబుల్: అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు తమ అరాచక పాలనను సాగిస్తున్నారు. మహిళలు, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఎంతటి అవరోధాలు ఎదురైనా అఫ్గాన్ ప్రజలకు అండగా ఉంటానని హామీలు ఇచ్చిన అప్పటి దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. ఆగస్టు 15న తాలిబన్లు రాజధాని కాబుల్‌లోకి అడుగుపెట్టగానే దేశం విడిచి పారిపోయారు. కాగా ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాజాగా గుర్తుచేసుకున్నారు. తన ప్రాణం పోయేంతవరకు పోరాడతానన్న అష్రఫ్ ఘనీ తాలిబన్ల రాకను గుర్తించి పారిపోయారని పేర్కొన్నారు.
అష్రఫ్ ఘనీని కాబుల్‌లోనే ఉండమని ఒప్పించేందుకు వ్యక్తిగతంగా ప్రయత్నించారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బ్లింకెన్ బదులిచ్చారు. ‘ఆగస్టు 14న నేను ఘనీకి ఫోన్ చేశాను. కాబుల్‌లో కొత్త ప్రభుత్వానికి అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించాల్సిందిగా సూచించాను. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటవుతుందని.. అందులో అఫ్గాన్‌లోని ఆయా వర్గాల వారికీ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉందని ఘనీకి వివరించాను’ అని వెల్లడించారు. ఇందుకు ఘనీ ఒప్పుకున్నట్లు కూడా తెలిపారు. ‘ఆయా వర్గాలకు తాలిబన్లు ప్రాధానం ఇవ్వకపోతే చచ్చేవరకు పోరాడతానని అష్రఫ్ నాతో అన్నారు. కానీ మరుసటి రోజే పారిపోయారు’ బ్లింకెన్ పేర్కొన్నారు. మరో తరం అమెరికన్లు కూడా అఫ్గాన్ వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకే.. 20 ఏళ్ల తమ పోరాటానికి అధ్యక్షుడు జో బైడెన్ ముగింపు పలికినట్లు బ్లింకెన్ పునరుద్ఘాటించారు.
ఇవీ చదవండి
Advertisement