Music: మ్యూజిక్‌ కోసం ఆమె అబ్బాయిగా మారింది.. కానీ..!

అమ్మాయి.. అబ్బాయిగా మారువేషంలో తిరగడం సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో అలాంటి సంఘటనలు చాలా అరుదు. అలాంటి అరుదైన ఘటనే చైనాలో చోటు చేసుకుంది. 13 ఏళ్ల అమ్మాయి తన కిష్టమైన మ్యూజిక్‌ బ్యాండ్‌లో చేరడం కోసం మగవతారం ఎత్తింది. బృందంతో కలిసి పాటలు పాడింది. అయితే,

Updated : 16 Oct 2021 10:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మాయి.. అబ్బాయిగా మారువేషంలో తిరగడం సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో అలాంటి సంఘటనలు చాలా అరుదు. అయితే, అలాంటి ఘటనే చైనాలో చోటు చేసుకుంది. 13 ఏళ్ల అమ్మాయి తన కిష్టమైన మ్యూజిక్‌ బ్యాండ్‌లో చేరడం కోసం పురుషుడి అవతారం ఎత్తింది. బృందంతో కలిసి పాటలు పాడింది. అయితే, ఆమె ఆడిన నాటకం ఎంతో కాలం నిలవలేదు. విషయం బయటపడటంతో దేశానికి క్షమాపణ చెప్పి సంగీత ప్రపంచానికి శాశ్వత వీడ్కోలు పలికింది. 

చైనాకు చెందిన ఫు జియాన్‌కు సంగీతమంటే ప్రాణం. అందుకే చైనాలో ప్రముఖ మ్యూజిక్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, వైజీఎన్‌ యూత్‌ క్లబ్‌లో చేరాలనుకుంది. కానీ, ఆ క్లబ్‌లో కేవలం అబ్బాయిలను మాత్రమే చేర్చుకొని శిక్షణ ఇస్తారు. సాధారణంగా ఈ క్లబ్‌లో అడ్మిషన్‌ కోసం ప్రత్యక్షంగా పరీక్ష రాయాల్సి ఉంటుంది. కానీ, కరోనా కారణంగా ఈ సంస్థ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి.. పరీక్ష నిర్వహించింది. దీని అదునుగా భావించిన ఫు జియాన్‌ తనను తాను అబ్బాయిగా చెప్పుకొని అడ్మిషన్‌ పొందింది. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించడం, ఆమె గొంతు, రూపు కాస్త మగవారిలాగే ఉండటంతో సంస్థ ప్రతినిధులు గుర్తుపట్టలేకపోయారు. 

అడ్మిషన్‌, శిక్షణ తర్వాత ఫు జియాన్‌ బ్యాండ్‌ గ్రూప్‌ రూపొందించిన పలు పాటలు విడుదలయ్యాయి. ఆమె గాత్రానికి అందరూ ఫిదా అయ్యారు.. వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే, కొంతమంది ఫుజియాన్‌ అబ్బాయి కాదు.. అమ్మాయి అని గుర్తుపట్టేశారు. విషయం బయట పడటంతో ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. ఆమె ఆడిన ఒక్క అబద్ధం తన చదువు, వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఫుజియాన్‌ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పింది. సంగీతాన్ని శాశ్వతంగా విడిచిపెడుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు వైజీఎన్‌ యూత్‌ క్లబ్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. తనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కాగా.. ఫుజియాన్‌ అభిమానులు మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఆమెకు బ్యాండ్‌ గ్రూప్‌లో పాటలు పాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని