20లక్షలు దాటిన కరోనా మరణాలు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 20లక్షలు దాటింది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం శుక్రవారానికే మరణాలు 20 లక్షలు దాటిపోయాయి. వుహాన్‌లో తొలిమరణం నమోదైన సరిగ్గా.........

Updated : 16 Jan 2021 13:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 20లక్షలు దాటింది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం శుక్రవారానికే మరణాలు 20 లక్షలు దాటిపోయాయి. వుహాన్‌లో తొలిమరణం నమోదైన సరిగ్గా ఏడాది తర్వాత ఈ సంఖ్య నమోదు కావడం గమనార్హం. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 20 లక్షలు కేవలం అధికారికంగా నమోదు చేసిన మరణాలేనని.. లెక్కలోని రానివి ఇంకా చాలా ఉంటాయని భావిస్తున్నారు. లక్షణాలు లేకుండా మరణించినవారు.. ఇళ్లలోనే పరీక్షలు చేయించుకోకుండా చనిపోయిన వారు ఇంకా చాలా మందే ఉంటారని అంచనా.

ఇంకా చాలా దేశాల్లో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు సమర్థంగా జరగడం లేదని నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో లెక్కలోకి రాని మరణాలు నమోదైన వాటికంటే 20శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈక్వెడార్‌, పెరు, రష్యా వంటి దేశాల్లో మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే 300-500 శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవడం ఊరట కలిగిస్తోంది. అయితే, ప్రతిఒక్కరికీ టీకా అందేందుకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని దేశాల్లో మహమ్మారి వ్యాప్తి మరోసారి తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, జర్మనీ, స్వీడన్‌, ఇండోనేసియా, ఇజ్రాయెల్‌, జపాన్‌ దేశాలు కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత అత్యంత దుర్భర దినాల్ని గత వారమే చవిచూడడం విచారకర విషయం. అలాగే క్రమంగా మరణాల రేటు సైతం పెరుగుతూ రావడం గమనార్హం. తొలి మిలియన్‌ మరణాలు నమోదు కావడానికి ఎనిమిది నెలలు పట్టగా.. తర్వాతి మిలియన్‌ కేవలం నాలుగు నెలల్లోనే రికార్డయింది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ లెక్కల ప్రకారం.. శనివారం ఉదయం 9:30 గంటల సమయానికి ప్రపంచవ్యాప్తంగా 20,08,237 మరణాలు నమోదయ్యాయి. 

దేశం        మరణాలు           కేసులు

అమెరికా     3,91,922        2,35,20,563  
బ్రెజిల్       2,08,246         83,93,492
భారత్‌       1,51,918        1,05,27,683
మెక్సికో      1,37,916         15,88,369    
యూకే       87,448         33,25,642
ఇటలీ        81,325         23,52,423
ఫ్రాన్స్‌        70,090        29,31,396
రష్యా         63,558        34,83,531

ఇవీ చదవండి..

ఇలా వైరస్‌ను గుర్తిస్తుంది.. అలా దాడి చేస్తుంది

నేడే టీకాకు శ్రీకారం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని