Global Round Up 2021: పది చిత్రాల్లో ప్రపంచ పరిణామాలు

కరోనా లాక్‌డౌన్ల నుంచి క్రమంగా బయటకు వస్తున్న ప్రపంచానికి 2021 ఆదిలోనే అనూహ్య ఘటన ఎదురైంది.....

Updated : 28 Dec 2021 13:15 IST

కరోనా లాక్‌డౌన్ల నుంచి క్రమంగా బయటకు వస్తోన్న ప్రపంచానికి 2021 ఆదిలోనే అనూహ్య ఘటన ఎదురైంది. అమెరికా చరిత్రకే మచ్చ తెచ్చే క్యాపిటల్‌ దాడి ప్రపంచ ప్రజాస్వామ్యవాదులను కలచివేసింది. తర్వాత అదే స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మయన్మార్‌లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తర్వాత ఎవర్‌గ్రీన్‌ నౌక ఇరుక్కుని కొన్ని రోజులు కలవరపెట్టింది. ఈ క్రమంలో కరోనా రెండో వేవ్‌ ప్రపంచాన్ని చుట్టుముట్టడంతో ఒలింపిక్స్‌ చప్పగా సాగాయి. అంతలోనే అఫ్గాన్‌లో ముగిసిన అమెరికా పోరాటం పెద్ద మానవతా సంక్షోభానికి దారి తీసింది. ఇలా ఈ ఏడాది ప్రపంచ ప్రయాణంలోని కీలక పరిణామాలపై ఓ లుక్కేద్దాం..!


అమెరికా చరిత్రకు మచ్చ

అమెరికా క్యాపిటల్​లో జరిగిన హింసాకాండ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బైడెన్​ విజయాన్ని ధ్రువీకరించేందుకు సమావేశమైన కాంగ్రెస్​ను అడ్డుకునేందుకు... ట్రంప్​ మద్దతుదారులు చేసిన ప్రయత్నంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. జనవరి 6న జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరికొందురు గాయపడ్డారు. ఈ పూర్తి వ్యవహారాన్ని అమెరికా మాజీ అధ్యక్షులు, నేతలు ఖండించారు. హింసకు ట్రంప్​ ప్రేరేపించారని మండిపడ్డారు. ఈ తరుణంలో జనవరి 20వరకు ఆయన​ అధ్యక్ష హోదాలో కొనసాగుతారా? అనే అనుమానం కూడా  అప్పట్లో తలెత్తింది. ఆయనపై అభిశంసన కూడా ప్రవేశపెట్టారు. కానీ, సాంకేతిక కారణాల వల్ల అది వీగిపోయింది. బైడెన్‌ ప్రమాణస్వీకారానికి కూడా ట్రంప్‌ హాజరుకాలేదు.


మయన్మార్‌ మళ్లీ సైన్యం చేతుల్లోకి

మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది నవంబర్‌లో మయన్మార్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌ సాన్‌ సూచీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామిక లీగ్‌ (ఎన్‌ఎల్‌డీ)కు దక్కిన భారీ విజయాన్ని ఆ దేశ సైన్యం జీర్ణించుకోలేకపోయింది. అధికారం దక్కే అవకాశాలు కనిపించకపోవడంతో ఫిబ్రవరి 1 తెల్లవారుజామున సైన్యం తిరుగుబాటు జరిపింది. జనరల్‌ మిన్‌ ఆంగ్‌ నేతృత్వంలో 11 మంది బృందంతో అధికారాన్ని కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆంగ్‌ సాన్‌ సూచీ సహా పలువురు నేతల్ని నిర్బంధించింది. సూచీకి ఇటీవల అక్కడి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష కూడా విధించింది.


ఖరీదైన ట్రాఫిక్‌ జామ్‌

ప్రపంచంలోనే అతి పెద్ద సరకు రవాణా నౌకల్లో ఒకటైన కంటెయినర్‌ నౌక ఎంవీ ఎవర్‌గివెన్‌.. ఈజిప్ట్‌లోని సూయిజ్‌ కాలువలో మార్చి 23న అనూహ్యంగా ఇరుక్కుపోయింది. దాదాపు 2,20,000 టన్నుల నిండు సరకుతో వెళ్తున్న నౌక అది. దీంతో మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాల్లో దాదాపు 320కి పైగా నౌకలు ఆగిపోయాయి. దీని వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి దాదాపు 9.6 బిలియన్‌ డాలర్ల(రూ.71.9 వేల కోట్లు) నష్టం వాటిల్లింది. ముడి చమురు ధరలు కూడా పెరిగాయి. ప్రపంచ  వాణిజ్యంలో 12 శాతం ఈ కాలువ ద్వారానే సాగుతుండడం గమనార్హం.


వీక్షకులు లేని ఒలింపిక్స్‌

125 ఏళ్ల ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి వీక్షకులు లేకుండా పోటీలు జరిగాయి. కరోనా కారణంగా బోసిపోయిన టోక్యో మైదానాల్లో ఆటగాళ్లు పోటీపడ్డారు. జులై 24న ప్రారంభమై ఆగస్టు 9న ముగిశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పలువురు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది.. కరోనా బారిన పడ్డారు. దీంతో అనేక మంది వాణిజ్య స్పాన్సర్లు వెనక్కి తగ్గారు. దీంతో దాదాపు 30 బిలియన్‌ డాలర్ల(2.24 లక్షల కోట్లు) నష్టం వాటిల్లినట్లు సమాచారం.


అఫ్గాన్‌లో మానవతా సంక్షోభం

2.3 ట్రిలియన్‌ డాలర్ల వ్యయం, 20 ఏళ్ల పాటు అఫ్గానిస్థాన్‌లో అమెరికా పోరాటం చివరకు తాలిబన్ల పైచేయితో ముగిసింది. కాబుల్‌ను తాలిబన్లు ఆగస్టు 15న హస్తగతం చేసుకున్నారు. ఆ వెంటనే వేలాది మంది అఫ్గానీలు దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు పోటెత్తారు. కొంతమందైతే ఎగురుతున్న విమానం నుంచి కిందపడి ప్రాణాలు పోగుట్టుకున్నారు. ఈ క్రమంలో కాబుల్‌ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా ఐఎస్‌ ఉగ్రమూకలు జరిపిన దాడిలో మొత్తం 183 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. అమెరికా సేనలు అఫ్గాన్‌ను వీడిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ దేశంలో నెలకొన్న మానవతా సంక్షోభానికి కాబూల్‌ ఎయిర్‌పోర్టు సాక్ష్యంగా నిలిచింది.


అతిపెద్ద సంక్షోభం

చైనాలోని రెండో అతిపెద్ద స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్‌. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. ఇది 300 బిలియన్‌ డాలర్ల అప్పులతో సంక్షోభం అంచున నిలిచింది. ఈ కంపెనీలో 2 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. పరోక్షంగా మరో 38 లక్షల మంది ఆధారపడ్డారు. వీరు, వీరి కుటుంబాలు కలిసి వందల కోట్ల యువాన్‌ల సొమ్ముతో కంపెనీ బాండ్లను కొనుగోలు చేశారు. ఈ కంపెనీ కింద 800 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. సకాలంలో బకాయిలు చెల్లించే స్థితిలో లేకపోవడంతో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ దీన్ని దివాలా తీసిన సంస్థగా ప్రకటించింది. 2021లో చైనా కంపెనీలు దాదాపు 10 బిలియన్‌ డాలర్ల విదేశీ బాండ్ల బకాయిలను ఎగవేశారు. వీటిలో స్థిరాస్థి రంగ సంస్థలదే 36 శాతం వాటా.


కొత్త ప్రపంచం

అంతర్జాలం, స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ వంటి సాధనాలు.. విప్లవాత్మక మార్పులకు కారణమైతే ఇప్పుడు వీటికి మించిన సాంకేతికత రానుంది. అదే ‘మెటావర్స్‌’. ఇంటర్నెట్‌ తర్వాత దీన్ని అతి పెద్ద మార్పుగా పేర్కొంటున్నారు. ఈ దిశగా 2021లోనే కీలక అడుగులు పడడం విశేషం. మనుషులను పూర్తిగా వర్చువల్‌ ప్రపంచంలో ఓలలాడించే ఈ సాంకేతికత.. ఆన్‌లైన్‌ అనుభూతిని సమూలంగా మార్చేస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఫేస్‌బుక్‌ సహా ప్రముఖ సంస్థలు.. ఈ సరికొత్త టెక్నాలజీపై దృష్టిపెట్టాయి. ఫేస్‌బుక్‌ ఏకంగా తన పేరును కూడా మెటాగా మార్చుకుంది.


ముగిసిన మెర్కెల్‌ శకం

జర్మనీకి తొలి మహిళా ఛాన్స్‌లర్‌గా చరిత్రలో చెరగని స్థానం సంపాదించుకున్న ఏంజెలా మెర్కెల్‌ శకం ముగిసింది. జర్మనీని సుదీర్ఘ కాలం పాలించిన నేతగా రికార్డు.. వారం రోజుల తేడాతో ఆమెకు దూరం అయ్యింది. మెర్కెల్‌ ప్రపంచంలో జర్మనీ పలుకుబడిని ఎంతో ఇనుమడింపజేశారు. 67 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేస్తున్న మెర్కెల్‌పై దేశ విదేశాల్లో ప్రశంసల వర్షం కురిసింది. ఆమె పాశ్చాత్య ప్రజాస్వామ్య విలువల సంరక్షకురాలిగా స్థిరమైన విజయాలు సాధించారు. 27 దేశాల ఐరోపా సమాఖ్య (ఈయూ)ను అనేక సంక్షోభాల నుంచి గట్టెక్కించి సమైక్యంగా నిలిపారు.


స్థానం సుస్థిరం

చైనా అధినేత జిన్‌పింగ్‌ వరసగా మూడోసారి అధికారపగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2022లో జరగబోయే చైనా కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌ సమావేశాల్లో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. ఇకపై ఆయన జీవితకాల అధ్యక్షుడిగా కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1949లో వామపక్ష చైనా ఆవిర్భావం అనంతరం మావో జెడాంగ్‌, డెంగ్‌ జియావో పింగ్‌ చైనా ఆధునిక చరిత్రలో తిరుగులేని నేతలుగా ఖ్యాతికెక్కారు. అదే కోవలో ఆర్థిక సంస్కరణల యుగం తరవాత పగ్గాలు చేపట్టిన జిన్‌పింగ్‌ యావత్‌ అధికారాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్నారు. తైవాన్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఈ ఏడాదిలో చాలా దూకుడుగా అడుగులు వేశారు. డ్రాగన్‌ను కట్టడి చేయడం కోసం అమెరికా ఏకంగా ‘ఆకుస్‌’ అనే కొత్త కూటమిని ఏర్పాటు చేసింది.


కుబేరుల స్పేస్‌ రేస్‌

ఈ ఏడాది కుబేరుల ‘రోదసీ రేస్‌’ జరిగింది. రోదసిలో ప్రయాణించిన తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థ అధిపతిగా బ్రిటన్‌ కుబేరుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ చరిత్ర సృష్టించారు. ‘వర్జిన్‌ గెలాక్టిక్‌ వీఎస్‌ఎస్‌ యూనిటీ’ అంతరిక్ష నౌక ద్వారా 85 కి.మీ వరకు చేరుకున్నారు. తర్వాత బ్లూ ఆరిజిన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్ ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌక ద్వారా 107 కి.మీ ఎత్తు వరకు చేరుకున్నారు. అనంతరం ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ నలుగురు సామాన్యులను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత జపాన్ కుబేరుడు యుసాకు మెజావా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజులు గడిపి భూమికి తిరిగివచ్చారు. ఈ సమయంలోనే రష్యాకు చెందిన చిత్ర బృందం ఐఎస్‌ఎస్‌లో షూటింగ్‌ నిర్వహించింది. ‘ది ఛాలెంజ్‌’ అనే చిత్రం కోసం దర్శకుడు, కథానాయిక.. అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించుకొని వచ్చారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని