అంతర్జాతీయంగా రికవరీల్లో మనమే టాప్‌!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల రికవరీల్లో భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు(సీఎఫ్‌ఆర్‌) కూడా తక్కువే అని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం మీడియాకు సమాచారం వెల్లడించింది.

Published : 03 Oct 2020 16:14 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల రికవరీల్లో భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు(సీఎఫ్‌ఆర్‌) కూడా తక్కువే అని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం మీడియాకు సమాచారం వెల్లడించింది. ‘అంతర్జాతీయంగా సీఎఫ్‌ఆర్‌ 2.97శాతంగా ఉండగా.. భారత్‌లో 1.56శాతంగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌ జనాభాకు 130 కరోనా మరణాలు సంభవిస్తుంటే.. భారత్‌లో 73 మంది మరణిస్తున్నారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా మొత్తం 54లక్షల మంది(83.84శాతం) వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. అంతర్జాతీయంగా రికవరీల్లో భారత్‌ వాటా 21శాతం ఉండగా.. కేసుల విషయంలో 18.6శాతం ఉంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 9లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పది లక్షల యాక్టివ్‌ కేసుల సంఖ్యను మించకుండా భారత్‌ స్థిరంగా కొనసాగడం ఇది 12వ రోజు. దేశంలో దాదాపు 77శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలోనే అత్యధికంగా రెండున్నర లక్షలకు పైగా కేసులున్నాయి’ అని కేంద్రం తెలిపింది.

కాగా గడిచిన 24 గంటల్లో 79వేల కేసులు నమోదు కాగా.. 1,069 మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య లక్ష దాటినట్లు కేంద్రం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని