Indigo: టేకాఫ్‌కు ముందు.. విమానం కిందకు దూసుకొచ్చిన కారు..!

దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతుండగా.. మరో విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు

Published : 02 Aug 2022 15:28 IST

దిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతుండగా.. మరో విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు చెందిన కారు ఒకటి దాని కిందకు దూసుకొచ్చింది. విమానం చక్రాన్ని ఢీకొట్టే ప్రమాదం కొద్దిలో తప్పింది.

మంగళవారం ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్‌ 2 స్టాండ్‌ నంబరు 201 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ స్టాండ్‌ వద్ద దిల్లీ నుంచి పట్నా వెళ్లేందుకు ఇండిగో విమానం సిద్ధంగా ఉంది. మరికొద్ది నిమిషాల్లో టేకాఫ్‌ ఉండగా.. గో ఫస్ట్‌కు చెందిన ఓ మారుతీ స్విఫ్ట్‌ డిజైర్‌ కారు విమానం ముందు భాగం కిందకు దూసుకొచ్చింది. అప్రమత్తమైన కారు డ్రైవర్‌ వెంటనే ఆపడంతో విమానం చక్రాన్ని ఢీకొట్టే ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని కారు డ్రైవర్‌ మద్యం సేవించాడా లేదా అని తెలుసుకునేందుకు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో అతడిని నెగెటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది. కాగా.. ఈ ప్రమాదంపై అటు ఇండిగో గానీ, ఇటు గో ఫస్ట్‌ సంస్థ గానీ స్పందించలేదు. మరోవైపు, ఇండిగో విమానం షెడ్యూల్‌ ప్రకారమే పట్నా బయల్దేరినట్లు అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని