Go First Airways: 55 మందిని వదిలేసిన గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌కు భారీ జరిమానా

గో ఫస్ట్‌ ఎయిర్‌ వేస్‌ (Go First Airways)కు DGCA భారీ జరిమానా విధించింది. విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ రూ.10 లక్షల (10 Laksh Rupees) కట్టాలని ఆదేశించింది.

Updated : 27 Jan 2023 20:00 IST

దిల్లీ:  విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ (Go First Airways)కు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) జరిమానా విధించింది. ఈ మేరకు రూ.10 లక్షలు చెల్లించాలని డీజీసీఎ స్పష్టం చేసింది. ఇటీవల గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ (Go First Airways)కు చెందిన G8 116 విమానం బెంగళూరు (Bengaluru) విమానాశ్రయంలో 55 మంది ప్రయాణికులను వదిలేసి టేకాఫ్‌ అయిన సంగతి తెలిసిందే. 

ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించిన డీజీసీఏ... తాజా ఘటనతో టెర్మినల్‌ కోఆర్డినేటర్‌, కమర్షియల్‌ సిబ్బంది, బోర్డింగ్‌ సిబ్బందికి మధ్య సమాచార లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయడంలో ఎయిర్‌లైన్స్‌ విఫలమైందని డీజీసీఏ పేర్కొంది. మరోవైపు ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రయాణికులను విడిచి వెళ్లిపోయినట్లు తమ వివరణలో పేర్కొంది.

విమానాశ్రయంలో మిగిలిపోయిన 55 మంది ప్రయాణికులు ఏడాదిలోపు దేశంలో ఎక్కడికైనా ఒకసారి ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. దిల్లీ వెళ్లాల్సిన తమను బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసి గోఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ విమానం టేకాఫ్‌ అయిందని 55 మంది ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో తమ అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం వైరల్‌గా మారడంతో డీజీసీఏ తీవ్రంగా పరిగణించి చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో జరిమానా విధించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని