lockdown: గోవాలో కరోనా లాక్‌డౌన్‌ పొడిగింపు

గోవాలో అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవుతున్న కారణంగా లాక్‌డౌన్‌ను పొడిగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Published : 29 May 2021 17:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌లో కూడా లాక్‌డౌన్ మెరుగైన ఫలితాలను ఇస్తోంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కాగా గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో రాష్ట్రాలు లాక్‌డౌన్‌ పొడిగించడానికే మొగ్గు చూపుతున్నాయి. 

గోవాలో అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవుతున్న కారణంగా లాక్‌డౌన్‌ను పొడిగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 21 శాతంగా ఉండడంతో జూన్‌ 7 వరకూ లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.‘‘2021 జూన్‌ 7 ఉదయం 7 గంటల వరకూ లాక్‌డౌన్‌ని పొడిగించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సంబంధిత జిల్లా కలెక్టర్లు జారీ చేస్తారు’’ అని గోవా సీఎంఓ ట్వీట్‌ చేసింది. 

కాగా గోవాలో మే 9 నుంచి 24 వరకూ కరోనా లాక్‌డౌన్‌లో భాగంగా కర్ఫ్యూ విధించారు. పాజిటివిటీ రేటు తగ్గకపోవడంతో కర్ఫ్యూను మే 31 వరకూ పొడిగించారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 48 శాతం నుంచి 21 శాతానికి పడిపోయినా, దాన్ని మరింత తగ్గించేందుకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ వస్తే సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో గోవాలో కొత్తగా 1,055 కరోనా కేసులు నమోదయ్యాయి. మే 28 నాటికి రాష్ట్రంలో 1,53,456 కరోనా కేసులు నమోదు కాగా 2,570 మరణాలు సంభవించాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని