Goa: పాక్‌కి మద్దతుగా మాట్లాడితే గోవాలో ఏం జరిగిందంటే..!

పాకిస్థాన్‌(Pakistan)కు మద్దతుగా మాట్లాడిన గోవా(Goa)లోని ఓ దుకాణం నిర్వాహకుడిని స్థానికులు మోకాళ్లపై నిలబెట్టారు. అతడి చేత భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేయించారు.

Published : 26 Feb 2023 01:31 IST

పనాజీ: గోవాలోని కెలాన్‌గేట్‌లో ఓ షాపు నిర్వాహకుడికి స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నాడంటూ అతడిపై అక్కడున్న వారు దాడికి యత్నించారు. మోకాళ్లపై బలవంతంగా కూర్చోబెట్టి.. ‘భారత్ మాతాకీ జై అంటూ’ నినాదాలు చేయించారు. గురువారం జరిగిన ఈ ఘటనపై వివరాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. 

గోవాకు చెందిన దావూద్‌ అనే బ్లాగర్ గతంలో ఓ వీడియోను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న క్రికెట్‌ మ్యాచ్‌ను కెలాన్‌గేట్‌లో ఓ దుకాణదారుడు చూస్తుండగా అక్కడికి వెళ్లిన బ్లాగర్‌ అతడితో ముచ్చటించాడు. ఏ దేశానికి మద్దతిస్తున్నావని అడగ్గా.. పాకిస్థాన్‌కు మద్దతిస్తున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా పాక్‌ ముస్లిం దేశమని అందుకే దానికి మద్దతిస్తున్నానని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను దావూద్‌ ట్విటర్‌లో పోస్టు చేయగా అది వైరల్‌గా మారింది.

దీంతో ఆ షాప్‌ యజమాని దగ్గరికి వెళ్లిన స్థానికులు అతడితో గొడవ పెట్టుకున్నారు. భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌కు మద్దతిస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కెలాన్‌గేట్‌లో హిందువులు, ముస్లింలు ఎంతో సోదరభావంతో ఉంటున్నారు. హిందూ ముస్లిం అనే తేడాలు లేవు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించొద్దు’ అంటూ అక్కడున్నవారు షాప్‌ యజమానిని నడిరోడ్డు మీద మోకాళ్లపై నిలబెట్టారు. అంతేకాకుండా ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేయించారు. అయితే, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని కెలాన్‌గేట్‌ పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లోని వీడియోల ఆధారంగా కేసుపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని