గోవా బనానా రిపబ్లిక్‌ కాదు..: రాణె

కరోనా కేసులు జనవరిలో పెరిగే అవకాశం ఉండటంతో పర్యాటకులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్‌ రాణె విజ్ఞప్తి చేశారు. గోవా బనానా రిపబ్లిక్‌ కాదన్నారు. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఆయన ........

Published : 02 Jan 2021 16:00 IST

పర్యాటకులు కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందేనన్న మంత్రి

పనాజీ: కరోనా కేసులు జనవరిలో పెరిగే అవకాశం ఉండటంతో పర్యాటకులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్‌ రాణె విజ్ఞప్తి చేశారు. గోవా బనానా రిపబ్లిక్‌ కాదన్నారు. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ.. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించడంలేదన్నారు. అందరూ కచ్చితంగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో తీరప్రాంతమైన గోవాకు పర్యాటకుల తాకిడితో ఈ నెలలో కరోనా కేసులు పెరగవచ్చని అనుమానం వ్యక్తంచేశారు. ఆహ్లాదం కోసం వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయాల్లో 60శాతం మంది ప్రజలు మాస్క్‌లు ధరించకపోవడం తాను చూసినట్టు చెప్పారు.

ఒక రాష్ట్రంగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, గోవా ప్రజల క్షేమాన్నే తాము కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగాలని, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరారు. నైట్‌ క్లబ్‌లలో కరోనా మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని, లేకపోతేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మాస్క్ ధరించని వారిపై పెనాల్టీని రూ.500లకు పెంచాలని ఆరోగ్యశాఖ ప్రతిపాదించనున్నట్టు చెప్పారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించని ప్రజలు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో పాటు ఇతరుల జీవితాన్ని ప్రమాదంలో పడేసేవారవుతారని, ఈ పరిస్థితి రాష్ట్రంలో వైద్యరంగానికి భారంగా పరిణమిస్తుందని చెప్పారు. 

బనానా రిపబ్లిక్‌ అంటే..?
బనానా రిపబ్లిక్‌ అంటే రాజకీయంగా అస్తవ్యస్థంగా ఉండటంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలను బనానా రిపబ్లిక్‌ అని వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఒక దేశం ఒకే వస్తువులను ఎగుమతులు చేస్తూ దానిపైనే ఆధారపడివుండటాన్ని కూడా బనానా రిపబ్లిక్‌గా పేర్కొంటారు. ఈ పదాన్ని ప్రముఖ అమెరికన్‌ రచయిత ఒ. హెన్రీ తన  పుస్తకం ‘క్యాబేజ్‌స్‌ అండ్‌ కింగ్స్‌’లో తొలిసారిగా వాడారు.  అప్పట్లో మధ్య అమెరికాలోని హోండూరస్‌ దేశం అమెరికా కంపెనీ చేతిలో దోపిడికీ గురయ్యేది. ఎక్కువగా అరటిపండ్ల ఎగుమతులపై ఆధారపడి వుండేది.  అమెరికా విధానాలను  విమర్శిస్తూ ఆయన హోండూరస్‌ను బనానా రిపబ్లిక్‌గా పిలిచారు.  ఇప్పటికీ ఏదైనా దేశంలో అస్తవ్యస్థ పరిస్థితులు ఏర్పడి ఒక ఏకీకృతమైన విధానం లేకపోతే బనానా రిపబ్లిక్‌గా విమర్శిస్తుంటారు.

ఇదీ చదవండి..

దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ఉచిత టీకా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని