దొంగలించిన అన్నపూర్ణమ్మ విగ్రహం.. 100ఏళ్ల తర్వాత కాశీకి పయనం

దాదాపు వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి తన స్వస్థలమైన కాశీకి పయనమైంది. ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి భారత్‌కు తెప్పించగా..

Updated : 11 Nov 2021 16:18 IST

దిల్లీ: దాదాపు వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణా దేవి విగ్రహం తిరిగి కాశీకి పయనమైంది. ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి భారత్‌కు తీసుకురాగా.. గురువారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా అందజేశారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఈ విగ్రహాన్ని యూపీ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, మీనాక్షీ లేఖి సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

నాలుగు రోజుల పాటు శోభాయాత్ర నిర్వహించి నవంబరు 15న కాశీలో విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు. గురువారం ప్రత్యేక రథంలో ఈ విగ్రహాన్ని దిల్లీ నుంచి అలీగఢ్‌ తీసుకెళ్లారు. నవంబరు 12న కనౌజ్‌కు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అయోధ్య వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఆ తర్వాత నవంబరు 15న వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

కెనడా నుంచి భారత్‌ చేరుకుందిలా..

దాదాపు 100 ఏళ్ల క్రితం భారత్‌ నుంచి దొంగలించిన మాతా అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని కెనడా నుంచి తెప్పిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతేడాది నవంబరులో ‘మన్‌ కీ బాత్‌’ సందర్భంగా వెల్లడించారు. ఈ విగ్రహం కెనడాలోని మెకంజీ ఆర్ట్‌ గ్యాలరీలో ఉంది. నోర్మన్‌ మెకంజీ వారసత్వంగా దీనిని ఈ గ్యాలరీలో ఉంచారు. 2019లో దివ్య మెహ్రా అనే ఆర్టిస్టు మెకంజీ గ్యాలరీలో తన ఎగ్జిబిషన్‌ కోసం సిద్ధమవుతూ ఈ విగ్రహాన్ని చూశారు. తర్వాత రికార్డులను పరిశీలించగా.. వారణాసి ఆలయం నుంచి చోరీకి గురైన విగ్రహంగా గుర్తించారు.  1913లో మెకంజీ భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ విగ్రహాన్ని చూశారట. ఆయన కోరిక మేరకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆలయం నుంచి దీనిని అపహరించి అతడికి ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీని గురించి తెలియగానే దివ్య మెహ్రా.. మెకంజీ ఆర్ట్‌ గ్యాలరీ సీఈవోతో మాట్లాడి విగ్రహాన్ని భారత్‌కు అప్పగించాలని కోరారు. ఆ తర్వాత ఒట్టావాలోని భారత దౌత్య కార్యాలయ అధికారులు కూడా దీనిపై కెనడా ప్రభుత్వంతో చర్చించగా.. విగ్రహాన్ని తిరిగిచ్చేందుకు ఆ దేశం అంగీకరించింది. అలా ఇటీవల అన్నపూర్ణమ్మ విగ్రహాన్ని తిరిగి భారత్‌కు అప్పగించారు. కాశీ అన్నపూర్ణా దేవి సాక్షాత్తు పరమశివుడికే భిక్ష వేసినట్లు హిందువులు నమ్ముతారు. ఈమె ఉన్న చోట ఆకలిబాధలు ఉండవని ప్రతీతి. 

కాగా.. భారత్‌కు స్వాతంత్ర్యం రాక ముందు చాలా మంది విదేశీయులు ఇక్కడి పురాతన విగ్రహాలను అపహరించారు. అలా చోరీకి గురైన వాటిల్లో 55 విగ్రహాలను 1976 నుంచి ఇప్పటివరకు దేశానికి తీసుకురాగలిగారు. వీటిల్లో 42 విగ్రహాలు.. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినవే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని