Train Collision:: ఘోర ప్రమాదం: రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీ

Train Collision: పశ్చిమ బెంగాల్‌లో ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలును గూడ్స్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 17 Jun 2024 12:53 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని దార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడం (Train Collision)తో ఓ బోగీ గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మృతిచెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అస్సాంలోని సిల్చార్‌ నుంచి కోల్‌కతా (Kolkata)లోని సీల్దాకు బయల్దేరిన కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్‌ (Kanchanjungha Express) మధ్యలో న్యూజల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే రంగపాని స్టేషన్‌ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్‌ రైలు (Goods Trains) దీన్ని బలంగా ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు గూడ్స్‌ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా.. ఎక్స్‌ప్రైస్‌ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి.  ఓ బోగీ గాల్లోకి లేవడం ప్రమాద తీవ్రతకు అద్దంపడుతోంది. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై దార్జిలింగ్‌ అదనపు ఎస్పీ మాట్లాడారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సిగ్నల్‌ దాటుకుని..

సిగ్నల్‌ జంప్‌ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్‌ సిగ్నల్‌ వేసినా గూడ్స్‌ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచారం వ్యక్తంచేశారు. ‘‘ఈ విపత్కర సమయంలో నా ఆలోచలన్నీ బాధిత కుటుంబాల వెంటే ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. సహాయక చర్యలు విజయవంతమవ్వాలి’’ అని ముర్ము ఆకాంక్షించారు. పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాద ఘటన తీవ్ర విచారకరమని ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఘటనాస్థలానికి బయల్దేరినట్లు వెల్లడించారు. 

ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఘటనాస్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయన్నారు. అటు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దీనిపై స్పందించారు. ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు. సహాయకచర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని