Modi-Pichai Meet: ప్రధాని మోదీతో గూగుల్‌ సీఈవో భేటీ

ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఆయన స్వదేశంలో పర్యటిస్తున్నారు.

Published : 19 Dec 2022 20:17 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మోదీతో చర్చించిన పిచాయ్‌.. అన్ని వర్గాల వారికి ఇంటర్నెట్‌ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన పిచాయ్‌.. మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. మీతో జరిగిన ఈ గొప్ప సమావేశానికి ధన్యవాదాలు. మీ నాయకత్వంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు రావడం ఎంతో స్ఫూర్తిదాయకం. మా దృఢమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడంతోపాటు భారత్‌ అధ్యక్షత వహిస్తోన్న జీ-20 సదస్సు నిర్వహణకు పూర్తి మద్దతు కోసం ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొంటూ ప్రధానితో భేటీ అనంతరం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌ చేశారు.

స్టార్టప్‌లపై దృష్టిపెట్టిన టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌.. గూగుల్‌ ఫర్‌ ఇండియా (Google For India) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కేవలం స్టార్టప్‌ల కోసమే సుమారు 300 మిలియన్‌ డాలర్లను కేటాయించిన ఈ సంస్థ.. ఇందులో నాలుగో వంతును మహిళల నేతృత్వంలోని సంస్థల్లోనే పెట్టుబడి పెట్టనుంది. మరోవైపు జీ-20 సదస్సు అధ్యక్ష బాధ్యతలు ఇటీవల స్వీకరించిన భారత్‌.. వచ్చే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 200 సమావేశాలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 2023లో జీ-20 సదస్సు దిల్లీలో జరగనున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని