Updated : 15 May 2021 16:17 IST

H-1B visa: గూగుల్‌ కీలక నిర్ణయం

వాషింగ్టన్‌: విదేశాల నుంచి అమెరికాకు వచ్చే అధిక నైపుణ్యం కలిగిన వలసదారులైన హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములకు వర్క్‌ వీసాలు అందించేందుకు గూగుల్‌ మద్దతు ఇచ్చింది. ఇప్పటికే పలు సంస్థలు సానుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేయగా, గూగుల్‌ సైతం ఈ జాబితాలో చేరింది. అమెరికాకు వచ్చే వలసదారులకు గూగుల్‌ మద్దతుగా ఉంటుందని సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు హెచ్‌-4ఈఏడీ(ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌) కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ఆవిష్కరణలు పెరిగి ఉద్యోగ సృష్టి జరుగుతుందన్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారి కుటుంబాలకు ఈ కార్యక్రమం ప్రయోజనకరంగా నిలుస్తుందని వివరించారు.

హెచ్‌-4 వీసాల వల్ల ఉద్యోగాల్లో పోటీ తత్వం దెబ్బతింటోందని అక్కడి కోర్టులో దాఖలైన కేసులో గూగుల్‌ మరో 30 సంస్థల తరపున అఫిడవిట్‌ సమర్పించింది. హెచ్‌-1బీ వీసాదారు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించే వ్యవస్థను కోరుకుంటున్నామని గూగుల్‌ తెలిపింది. దీని ద్వారా సుమారు 90వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని గూగుల్‌ న్యాయ విభాగం ఉపాధ్యక్షురాలు కేథరిన్‌ లఖవేరా తెలిపారు.

హెచ్‌-1బీ వీసా కలిగిన వారు తమ భాగస్వామితో పాటు పిల్లలు కూడా అమెరికాలో ఉండేందుకు యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) అనుమతి ఇస్తుంది. ‘వలసదారులకు మద్దతుగా నిలిచేందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. మరో 30 సంస్థలతో కలిసి హెచ్‌-4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాం. దీని వల్ల ఆవిష్కరణలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ కార్యక్రమం వారి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది’ అని పిచాయ్‌ ట్వీట్‌ చేశారు. అడోబ్‌, అమెజాన్‌, యాపిల్‌, ఈబే, ఐబీఎం, ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌, పేపాల్‌, ట్విటర్‌ సహా ఇతర కంపెనీలు హెచ్‌-4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు తెలిపాయి. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో అనేక ఆంక్షలు విధించారు. జోబైడెన్‌ అధ్యక్షుడు అయిన తర్వాత ట్రంప్‌ విధించిన నియమ నిబంధనలు, ఆంక్షలను ఉపసంహరించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని